కుటుంబాలతో కలిసి ఆందోళన..

Women RTC Workers Protesting Playing Bathukamma and Kabaddi Games - Sakshi

17వ రోజూ కొనసాగిన ఆర్టీసీ సమ్మె

బతుకమ్మ, కబడ్డీ ఆటలు ఆడుతూ నిరసన తెలిపిన మహిళా కార్మికులు

రోడ్డెక్కిన 69 బస్సులు

యాదగిరిగుట్ట : ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. 17వ రోజు సోమవారం కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమస్య కొలిక్కి వస్తుందని ఆశించినా.. సర్కార్‌ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించకపోవడంతో పరిస్థితి యథావిధిగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేసేందుకు నెలాఖరు వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించి సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ కార్మికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆయా కార్మిక సంఘాలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

కార్మికులు వినూత్న నిరసన
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కార్మికులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట ఆర్టీ సీ డిపో గేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. మ హిళా కార్మికులు బతుకమ్మ, కబడ్డీ ఆడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భం గా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ప్రగతి చక్రాలను ఆపి ప్రత్యేక రాష్ట్రం సాధనకు పోరాడారని గుర్తుచేశారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సమ్మెలోకి వెళ్తే తమ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సీ ఎం కేసీఆర్‌ ప్రకటించడం బాధాకరమన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే కలిగే ప్ర యోజనాలను సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ జేఏసీ నాయకులు గతంలోనే వివరించారని, కానీ ఆర్టీసీ నష్టాల్లో ఉందని, ప్రయివేటీకరణ చేసే దిశగా వ్యూహాలు రచించడం మంచిది కాదన్నారు. 

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు..
దసరా సెలవుల పూర్తయిన తరువాత రాష్ట్ర ప్ర భుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మెను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 19వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులను పొడగించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రా రంభమయ్యాయి. కానీ వివిధ రూట్లలో ఉద యం నడిచే బస్సులు సరైన సమయానికి వెళ్లకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు సమయానికి బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రోడ్డెక్కిన 69 బస్సులు
సోమవారం ఆర్టీసీ 56, ప్రైవేట్‌కు చెందిన 13బస్సులను అధికారులు రోడ్డెక్కించారు. మొదటి రోజు మాదిరిగానే ఆర్టీసీ అధికారులు బస్సులకు ముందు పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనాలతో తీసుకెళ్లారు. బస్టాండ్, డిపో ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ మనోహర్‌రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు ఆధ్వర్యంలో పోలీసు నిఘా పెట్టారు. 

ఇన్‌చార్జ్‌ డీఎంగా రమేష్‌
యాదగిరిగుట్ట డిపో ఇన్‌చార్జ్‌ మేనేజర్‌గా రమేష్‌ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. డిపో మేనేజర్‌గా పని చేసిన రఘుకు ఆదివారం అర్ధరాత్రి నుంచి తీవ్ర జ్వరం రావడంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌ డీఎంగా రమేష్‌ను పంపించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top