కుల చైతన్యంతోనే ఈ స్థాయికి వచ్చా...

కుల చైతన్యంతోనే ఈ స్థాయికి వచ్చా...


టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య

కాపుగర్జన నిర్వహించాలని సూచన

మున్నూరు కాపు భవన నిర్మాణానికి భూమి పూజ

హాజరైన కొండా దంపతులు, ఎమ్మెల్సీ పూలరవీందర్


 

 హన్మకొండ చౌరస్తా : ‘నా చిన్న తనంలో మానాన్న వ్యవసాయ జీతగాడిగా పనిచేసే వాడు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కుల చైతన్యమే’ అని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హన్మకొండ అలంకార్ జంక్షన్ సమీపంలోని నూతనంగా నిర్మించనున్న కాపు సంఘం భవనానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఈమెయిల్ వంటి ఆధునిక టెక్నాలజీతో వివిధ ప్రాంతాల్లోని కులబాంధవులను ఐక్యం చేసేందుకు ప్రతి ఒక్క కాపు సోదరుడు కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇక్కడికి రాగానే కులబంధం గుర్తుకొచ్చిందన్నారు.



సంఘం భవన నిర్మాణానికి తన వంతు ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు. అందరిని ఒక్కతాటి పైకి తెచ్చేందుకు నేటి తరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం వంటి పోటీలను నిర్వహించాలని సూచించారు. కాపు భవన్‌లో ప్రత్యేక లైబ్రరినీ ఏర్పాటు చేయాలన్నారు. ఐకమత్యంతో ముందుకు పోయి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన నాయకత్వం కులానికి అవసరమన్నారు. వ్యాపార, రాజకీయ, స్నేహబంధాలలో ఆలోచనలు, వైఖరి మారవచ్చు కానీ, కుల బంధంలో ఆలోచనలు మారవన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి కులం ఐక్యత కోసం పనిచేయాలని సూచించారు. కాపు భవనానికి సీఎం కేసీఆర్ రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఆయనకు కుల బంధువుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ తనకు రాజకీయంగా ఈ అవకాశం వచ్చిందంటే కాపు సోదరుల ప్రోత్సాహమేనని అన్నారు. అన్ని జిల్లాల్లోని కాపు వర్గాల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కాపు భవన నిర్మాణానికి తన వంతు సాయమందిస్తానని హామీ ఇచ్చారు.



మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మాట్లాడుతూ కుల అభ్యున్నతి కోసం ప్రతి పనిలో ముందుంటానన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొండా సురేఖ విజయానికి కులబాంధవుల సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, తోట తిరుపతయ్య, డాక్టర్ కాళీప్రసాద్, ఈవీ శ్రీనివాసరావు, ఆశం కళ్యాణ్, వద్దిరాజు రవిచంద్ర, గుజ్జుల నర్సయ్య, కనుకుంట్ల రవికుమార్, కోలా జనార్దన్, కేడల ప్రసాద్, తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top