రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు వస్తున్నప్పుడు ప్రతిపక్షాలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు వస్తున్నప్పుడు ప్రతిపక్షాలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
ప్రజల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా అవమానించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓటుకు నోటు, సెక్షన్ 8 వంటివాటిని రాష్ట్రపతి దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. రాజకీయ అవినీతికి పాల్పడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టుగా సుధాకర్ రెడ్డి వెల్లడించారు.