పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఇందుకోసం అన్ని సంఘాలతో కలిసి బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని వక్తలు పిలుపునిచ్చారు.
తెలంగాణ గిరిజన సంఘం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఇందుకోసం అన్ని సంఘాలతో కలిసి బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని వక్తలు పిలుపునిచ్చారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడ పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సదస్సు జరిగింది. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ డాక్టర్ కె. నాగేశ్వర్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ హరగోపాల్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.
సదస్సులో కోదండరాం మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ వల్ల కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందన్నారు. గతంలో ఈ గ్రామాలో ఆంధ్రప్రాంతంలో ఉండేవని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అంటున్నారని, అయితే సరిహద్దులు ప్రజల అవసరాల కోసం జరుగుతాయా? పాలకుల అవసరాల కోసం జరుగుతాయా? అని ప్రశ్నించారు. సమావేశంలో గిరిజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీరాములు నాయక్,ప్రొఫెసర్ బంగ్యా భూక్యా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, సూర్యం తదితరులు పాల్గొన్నారు.