ఎవరికి ‘జయ’మో!? | who getting victory in new year? | Sakshi
Sakshi News home page

ఎవరికి ‘జయ’మో!?

Mar 31 2014 1:38 AM | Updated on Sep 2 2017 5:22 AM

‘విజయ’ నామ సంవత్సరం వీడ్కోలు తీసుకుంది.... ‘జయ’వచ్చేసింది. నూతనసంవత్సరం రసవత్తరంగా ప్రారంభమయింది.

 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘విజయ’ నామ సంవత్సరం వీడ్కోలు తీసుకుంది.... ‘జయ’వచ్చేసింది. నూతనసంవత్సరం రసవత్తరంగా ప్రారంభమయింది. ఈ ఏడాది తొలి అంకంలోనే కీలక రాజకీయ పోరుకు తెరలేచింది. జిల్లా రాజకీయనేతలకు అగ్నిపరీక్ష పెట్టింది. అందుకే ఇప్పుడు చర్చ అంతా రాజకీయమే. నాయకులు ‘జయ’నామ సంవత్సరం ఎలా ఉంటుందో.... తమ రాశిఫలాలు ఎలా ఉన్నాయో... ఏ గ్రహం ఎక్కడ ఉందో.... ఏ గ్రహం ఎలాంటి ప్రభావం చూపుతుందోననే లెక్కలు కట్టే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలు కూడా... ఎవరికి ఈ ఏడాది రాజపూజ్యమో... ఎవరికి అవమానమోనని చర్చించుకుంటున్నారు.   

 శీనన్న రికార్డులు తిరగరాస్తారా?
 అనతి కాలంలోనే జిల్లా ప్రజలకు సుపరిచితుడయ్యారు ైవె ఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.  జయనామ సంవత్సరంలో ఈయన జాతకం ఎలా ఉంటుందో అన్నదే ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఈయన దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న నాయకులకు దీటుగా ముందుకెళుతున్నారు.  ఏ పనినయినా సమర్థవంతంగా, మంచి ఆలోచనతో పూర్తి చేసే ఈయనకు ఈ ఏడాది రాజకీయంగా చాలా కీలకం. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఖమ్మం జిల్లాలో రికార్డులు కూడా చెరిగిపోయే అవకాశం ఉంది. గెలిచిన తొలిసారే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశమూ ఉంది. మరి జయనామ సంవత్సరం పొంగులేటికి ఎలాంటి అనుభూతిని మిగులుస్తుందో వేచి చూడాల్సిందే.

 ఫైర్‌బ్రాండ్ పరిస్థితేంటో?
 జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఎంపీ రేణుకాచౌదరి అవసరమైతే తన జాతకాన్ని కూడా మార్చుకునేంత సాహసవంతురాలు. ఈమెకు జయనామ సంవత్సరం కలిసిరాదని ఎవరైనా చెపితే.... జయా లేదూ... విజయా లేదు... నా జాతకం చెప్పడానికి నీవెవరు అని హెచ్చరిస్తారు. తన రాజకీయ ప్రత్యర్థులపై ఫైర్ కావడంలో దిట్ట అయిన ఈమెకు ఈ ఏడాది ‘ప్రత్యక్ష’ లబ్ధి అనుమానమే. ఆమెకు ఎంపీ టికెట్ వస్తుందో రాదో అన్నది పక్కన పెడితే  తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడమే ఇప్పుడు పెద్ద పరీక్ష. తన వెన్నంటి ఉన్న వనమా సీటుకు అప్పుడే ఎసరు వచ్చింది. అయినా జిల్లాలో చాలా మంది ఈమెపై ఆశ పెట్టుకున్నారు. మరి వీరి ఆశలను  రేణుకాచౌదరి జాతకం వమ్ము చేస్తుందో... నిలబెడుతుందో?

 ‘నామా’కు కలిసొస్తుందా?
 టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు నూతన సంవత్సరం రాజకీయంగా కలిసివస్తుందా అన్నదే ఇప్పుడు చర్చ. కేవలం ఆర్థికబలంతో తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఈయనకు అవమానం పాలు ఎక్కువ  చేయాలని సొంతపార్టీలోని నాయకులే కంకణం కట్టుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జయ నామసంవత్సరంలో ఈయనకు ‘చేదు’ గురుతులే మిగల్చాలన్నది వీరి రాజకీయ ప్రత్యర్థుల లక్ష్యంగా కనిపిస్తోంది.  ఈయనేం తక్కువ తిన్నారా...? సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థులకు సవాల్ విసిరి కయ్యానికి ‘సై’ అంటున్నారు. పార్టీ అధినేతను మెప్పించడంలో, తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో ఇప్పటివరకు ఈయన జాతకం బాగానే ఉంది. కానీ ముందుంది మొసళ్ల పండుగ అన్నట్టు... అటు సొంత పార్టీ, ఇటు ఇతర పార్టీల నాయకులు ఈయనకు చుక్కలు చూపించే పరిస్థితి కనిపిస్తోంది.

  ఒకప్పటి ‘లెజెండ్’ లైవ్‌లోనే ఉంటారా?
 ఇక, జిల్లా రాజకీయాలను శాసించి ప్రస్తుతం సొంత పార్టీలోనే ప్రాధాన్యం కోసం పోరాడాల్సిన పరిస్థితుల్లో ఉన్న టీడీపీ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావుకు జయ నామ సంవత్సరం ఎలాంటి ఫలితాలనిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ ముఖ్యపాత్ర పోషించి జిల్లా అధికార యంత్రాంగానికి చెమటలు పట్టించిన  ఒకప్పటి ఈ ‘లెజెండ్’ మాట ఇప్పుడు సొంత పార్టీలోనూ చెల్లుబాటు కావడం లేదని పార్టీ వర్గాలంటున్నాయి. తన సీటుకు ఢోకా లేకపోయినా, తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలోనూ ఈయనకు గ్రహాలు కలిసిరావడం లేదు. నామా రూపంలో పొంచి ఉన్న ‘గ్రహం’ ఈయన రాజకీయ భవిష్యత్తును ఎలాంటి మలుపు తిప్పుతుందో... జయ నామ సంవత్సరం తుమ్మలకు ఎలా ఉంటుందోనన్నది కాలమే తేల్చాల్సి ఉంది.

 మార్క్సిస్టు సారథి మాట  నిలబడుతుందా?
 జిల్లా కమ్యూనిస్టుల్లో చెరగని ముద్ర వేసుకున్న  తెల్దారుపల్లి బిడ్డ తమ్మినేని వీరభద్రం ఏకంగా తెలంగాణ రాష్ట్రానికే సారథి అయ్యారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర తొలి కార్యదర్శిగా రికార్డులకెక్కిన ఈయన రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం పద్మవ్యూహంలో పడింది. అటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని నడిపించాల్సిన బాధ్యతలతో పాటు ఇటు జిల్లాలోనూ కీలకంగా వ్యవహరించాల్సిన ఈయన చట్టసభలకు తాత్కాలికంగా దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జయనామసంవత్సరం రాకముందే జరిగిన ఈ పరిణామం ఆయనను రాష్ట్ర ముఖ్య నేతగా మార్చినా ‘పొలిటికల్ పవర్’ లేని పార్టీ పదవి ఆయన జాతకాన్ని ఎలాంటి మలుపులు తిప్పనుందో?

 వనమా స్థానం సుస్థిరమేనా?
 జిల్లా కాంగ్రెస్‌లో కీలక నాయకుడైన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు రాజకీయ భవిష్యత్తును నిర్ధారించేది ఖచ్చితంగా ‘జయ’నామ సంవత్సరంలోని తొలి అంకమే. పొత్తుల ఎత్తులలో చిత్తయ్యే దశలో ఉన్న వనమాకు ఈ ఏడాది గ్రహాలు అనుకూలించకపోతే ఇక శాశ్వతంగా రాజకీయ ‘గ్రహణమే’ననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘ఆడబిడ్డ’ను నమ్ముకున్న వనమా మళ్లీ రాజకీయ అందలం ఎక్కుతారా...? లేక జెండా మార్చయినా తన భవిష్యత్తును సజీవ ంగా ఉంచుకుంటారా..? ఈ ప్రశ్నలకు సమాధానం ఆయన గ్రహబలాన్ని బట్టే ఉండబోతోంది.

 కూనంనేని అడ్రస్ ఢిల్లీనా? కొత్తగూడెమా?
 సీపీఐ సిట్టింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశిరావు రాజకీయ అడ్రస్ కొత్తగూడెంలోనే ఉంటుందా.. లేక వయా ఖమ్మం ఢి ల్లీ గల్లీకి వెళుతుందా అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్. ఈసారి ఎక్కడ పోటీచేస్తారన్న దానిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. పొత్తుల్లో భాగంగా ఖమ్మం ఎంపీ స్థానాన్ని సీపీఐకిస్తే అక్కడి నుంచి కూనంనేనికి అవకాశం వస్తుందన్న వార్తలు ఆయనకు ఒకరకంగా నిద్రపట్టనివ్వడం లేదనే చెప్పాలి. కొత్తగూడెం అసెంబ్లీకి పోటీ చేసి మళ్లీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకుంటున్న ఆయన కోరిక జయనామ సంవత్సరంలో తీరుతుందా? చూడాలి.

 లింగాల బిడ్డకు లైన్‌క్లియరేనా?
 సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదిగిన రాంరెడ్డి వెంకటరెడ్డి ఈ జయనామ సంవత్సరంలో మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. మళ్లీ పాలేరు నుంచే పోటీ తప్పదని భావిస్తున్నా..అక్కడ విజయం అంత సునాయసం కాదని గ్రహాలంటున్నాయి. ఇప్పటికే తన ఇలాకాలో రేణుకాచౌదరి యత్నాలతో పార్టీలో ఉన్న కేడర్ సహకరిస్తుందా? పందేలంటే విపరీతమైన మోజున్న ఈ లింగాల బిడ్డ మరి ఎన్నికల పందెంలో ‘బండ’ ఎంతవరకు లాగుతారు అన్నది ఆసక్తికరమే.

 వైరా కుర్చీ చంద్రావతిదేనా?
 ఇక, జిల్లాలోనే అతి చిన్న వయసున్న రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందిన వైరా ఎమ్మెల్యే డాక్టర్. బాణోతు చంద్రావతి రాజకీయ భవితవ్యం కూడా జయ నామసంవత్సరమే తేల్చబోతోంది. ఎంబీబీఎస్ పూర్తి కాగానే చట్టసభల్లో అడుగుపెట్టిన ఆమెకు రాజకీయం పెద్దగా తెలియదనే చెప్పాలి. పూర్తిగా పార్టీ కనుసన్నల్లో పనిచేసిన ఆమెను మరి పార్టీ గుర్తించలేదో.... పార్టీ ఆశించినంతగా ఆమె పనిచేయలేదో కానీ... చివరకు పార్టీకి దూరమయ్యే స్థితిలోకి వెళ్లారు.

పార్టీ తనకు అన్యాయం చేసిందంటూ మూడు పేజీల స్వదస్తూరి లేఖను మీడియాకు విడుదల చేసిన ఈమె ఆ తర్వాత పెద్దగా జిల్లాలో కనిపించడం లేదు. అసలు ఈమె రాజకీయాల్లోనే ఉంటారా? ఉంటే కమ్యూనిస్టు పార్టీలోనే ఉంటారా? ఉన్నా కమ్యూనిస్టు పార్టీ మళ్లీ వైరా టికెట్ ఇస్తుందా? లేక ఇంకో పార్టీలోనికి వెళతారా? అసలు ఎవరెవరితో చర్చలు జరుపుతున్నారు? చివరికి ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం ‘సస్పెన్స్’! మరి ఈ సస్పెన్స్‌కు జయ నామ సంవత్సరం ఎలాంటి ముగింపు పలుకుతుందో చూద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement