గగనసింహాలకు బై బై! | Indian Air Force MiG-21 fighter jet to retire by September 2025 | Sakshi
Sakshi News home page

గగనసింహాలకు బై బై!

Aug 26 2025 4:15 AM | Updated on Aug 26 2025 4:15 AM

Indian Air Force MiG-21 fighter jet to retire by September 2025

ఆరుదశాబ్దాలు అద్వితీయ సేవలు అందించిన మిగ్‌–21 యుద్ధవిమానాలు

చివరిసారిగా దిగ్గజ లోహవిహంగాలతో వైమానిక విన్యాసాలు చేసిన ఫైటర్‌జెట్‌ పైలట్లు

వచ్చే నెలలో మిగ్‌ సేవలకు గౌరవప్రదంగా పరిసమాప్తి పలకనున్న వాయుసేన

బికనీర్‌: దశాబ్దాలపాటు భారత గగనతలాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చి కంటికి రెప్పలా కాపాడిన మిగ్‌–21 రకం యుద్దవిమానాలు ఇక శాశ్వత విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో చివరిసారిగా వీటిని ఫైటర్‌జెట్‌ పైలట్లు తమ విధి నిర్వహణ కోసం వినియోగించుకున్నారు. సోమవారం రాజస్తాన్‌లోని బికనీర్‌లో ఉన్న నాల్‌ ఎయిర్‌ఫోర్స్‌స్టేషన్‌ గగనతలంపై వైమానిక విన్యాసాలు పూర్తిచేశారు.

 వీటికి వీడ్కోలు సూచికగా ఇప్పటికే ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ ఒక్కరే మిగ్‌–21ను నడిపి అలా గగనవీధిలో చక్కర్లు కొట్టివచ్చారు. ఏకంగా 62 సంవత్సరాలపాటు సేవలందించిన దిగ్గజ వాయుసేన విమానాలకు గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు భారత వాయుసేన సిద్ధమైంది. 23వ పాంథర్‌ స్క్వాడ్రన్‌ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని తమ విధుల నుంచి రిటైర్‌కానుంది. సెప్టెంబర్‌ 26న చండీగఢ్‌లో భావోద్వేగ వీడ్కోలు కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో మిగ్‌–21 యుద్ధవిమానాల ప్రస్థానంలోని కొన్ని ముఖ్య ఘట్టాలపై ఓసారి విహంగవీక్షణం చేద్దాం..

1960 దశకంలో భారత్‌కు ఆగమనం..
1963లో తొలిసారిగా రష్యా నుంచి భారత్‌ వీటిని కొనుగోలుచేసింది. తొలినాళ్లలో యుద్దాల్లో విజయాలకు బాటలువేస్తూ మిగ్‌–21 విమానాలు తమకు ఏవీ సాటిలేవని నిరూపించుకున్నాయి. దాదాపు 870కిపైగా మిగ్‌ విమానాలు వాయుసేనలో వివిధ దశల్లో తమ అమూల్యమైన సేవలు అందించాయి. భారత వాయుసేనలో చేరిన తొలి సూపర్‌సోనిక్‌ ఫైటర్‌జెట్‌లుగా మిగ్‌–21ను చెప్పొచ్చు. గాల్లో చురుగ్గా కదలడం, అత్యధిక వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. మిగ్‌–21 యుద్ధ విమానాలు అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించాయి. 1965, 1971 యుద్ధాల్లో భారత చిరస్మరణీయ విజయాల వెనుక మిగ్‌ విమానాల కీలకపాత్ర ఉంది. 

అసమాన రికార్డ్‌
మిగ్‌–21 రకం విమానాలు భారత్‌లోనేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కీలక వైమానిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా అత్యధికంగా ఉత్పత్తయిన యుద్ధవిమానాల్లో ఒకటిగానూ ఇది రికార్డ్‌ సృష్టించింది. ఇప్పటిదాకా 60కిపైగా దేశాల్లో ఏకంగా 11,000 మిగ్‌లను తయారుచేశారు. ఇది సెకన్‌కు 250 మీటర్‌ల వేగంతో నిట్టనిలువుగా కూడా ప్రయాణించి శత్రు దేశాలను భయభ్రాంతులకు గురి చేయగలదు.

గవర్నర్‌ భవనంపై భీకర దాడి
1971లో బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో పాకిస్తాన్‌ సేనలపై భారత్‌ మిగ్‌–21 యుద్ధవిమానాలు విరుచుకుపడిన తీరు ఎవరూ మర్చిపోరు. ముఖ్యంగా ఆనాడు డిసెంబర్‌ 13వ తేదీన ఢాకాలోని గవర్నర్‌ అధికార భవనంపై మిగ్‌–21 బాంబులతో దాడిచేసింది. దెబ్బకు జడుసుకున్న గవర్నర్‌ మరుసటి రోజే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రోజే 93,000 మంది పాక్‌ సైనికులు భారత సైన్యం ఎదుట లొంగిపోయారు. 

1999లోనూ కార్గిల్‌ యుద్ధంలో మిగ్‌లు సత్తా చాటాయి. ఆపరేషన్‌ సఫేద్‌సాగర్‌లో భాగంగా ఆనాడు పాకిస్తానీ అట్లాంటిక్‌ విమానాన్ని మిగ్‌ ఒక్క దెబ్బతో నేలమట్టంచేసింది. అత్యంత శక్తివంతమైన ఎఫ్‌–16ను సైతం నేలకూల్చి 2019 ఏడాదిలో మిగ్‌ పత్రికల పతాక శీర్షికలకెక్కింది. మిగ్‌–21 పాతబడినాసరే అందులోని కొన్ని సాంకేతికతలు అత్యంత అధునాతనమైనవి. కంటికి కనిపించని సుదూర లక్ష్యాలపైనా దాడి చేసేలా రాడార్, తదితర సాంకేతికతలు దీని సొంతం.

ఎగిరే శవపేటికలుగా అపకీర్తి
తొలినాళ్లలో విజయ చిహ్నాలు గా చెలరేగి పోయిన ఈ విమానాలు కాలం గడిచేకొద్దీ పాతబడిపోయి ప్రాణాంతకంగా తయార య్యాయి. కాలం చెల్లిన మిగ్‌లను ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారనే విమర్శలూ ఎక్కువయ్యాయి. సుఖోయ్, రఫేల్, తేజస్‌ వంటి యుద్ధ విమానాల రాకతో వీటి అవసరం సైతం తగ్గిపోయిందని వైమానిక రంగ నిపుణులు అభిప్రాయపడు తున్నారు. భారత వాయుసేన ఆధ్వర్యంలోని 872 మిగ్‌ విమానాల్లో 482 పలు ప్రమాదాల్లో నేలకూలాయని పుష్కరకాలం క్రితం నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోని పార్లమెంట్‌లో చెప్పారు. భారత వాయుసే నలో అత్యధికంగా కూలిపో యిన యుద్ధవిమానాలుగా ఇవి అపకీర్తిని మూటగట్టుకున్నాయి. 1963లో తొలిసారిగా ఎక్కడైతే భారత వాయుసేనలోకి వీటిని తీసుకుని జాతికి అంకితం చేశారో అదే వైమానిక స్థావరంలో వీటికి తుది వీడ్కోలు పలకనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement