వచ్చే నెల నుంచే ‘ఎస్సారెస్పీ’కి నీరు | Water to SRSP from next month says Harishrao | Sakshi
Sakshi News home page

వచ్చే నెల నుంచే ‘ఎస్సారెస్పీ’కి నీరు

Nov 17 2017 1:46 AM | Updated on Nov 17 2017 1:46 AM

Water to SRSP from next month says Harishrao - Sakshi

గురువారం ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌

సాక్షి, హైదరాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు డిసెంబర్‌ నుంచే నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుత యాసంగిలో మొత్తంగా 6.10 లక్షల ఎకరాలకు నీరందించనున్నారు. ఈ మేరకు గురువారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లోయర్‌ మానేర్‌ డ్యాం ఎగువన 4 లక్షల ఎకరాలకు, దిగువన 1.60 లక్షల ఎకరాలకు, సరస్వతి, లక్ష్మీ కాలువల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని తీర్మానించారు. రెండు, మూడు రోజుల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. 

రెండో వారం నుంచి.. 
యాసంగికిగాను ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలపై కరీంనగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్‌ రెండో వారం నుంచి సాగునీరు ఇవ్వాలని, మొత్తంగా 8 తడులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎక్కువ నీళ్లు వచ్చేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయకట్టు చివరి రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ఈ ఏడాది కృష్ణాలో బాగానే నీళ్లు వచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు గోదావరిలో తక్కువగా వచ్చాయన్నారు.

ఎస్సారెస్పీలోకి సాధారణం కంటే 15 శాతం తక్కువగా నీరు చేరిందని, ప్రస్తుతం 63 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. ఎస్సారెస్పీ స్టేజి–1లో చివరి ఆయకట్టు వరకు నీరిచ్చేలా పనులు చేపట్టేందుకు రూ.1,000 కోట్లు కేటాయించామని.. ఆ పనులు వేగవంతమయ్యేలా చూడాలని సూచించారు. అయితే ఆయా పనుల పేరుతో పంటలకు నీరందించే ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. ఈ పనులను 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు. వీఆర్వో, వీఆర్‌ఏల సేవలను సైతం నీటి విడుదల పనులకు వినియోగించుకోవాలని సూచించారు. ఎల్‌ఎండీ దిగువన 1.60 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.  సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, గంగుల కమలాకర్, పుట్టా మధు, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, విద్యాసాగర్‌రావు, మనోహర్‌రెడ్డి, బొడిగె శోభ, ప్రభుత్వ స్పెషల్‌ సీఎస్‌ జోషీ, సాగునీటి శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఈ బి.శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

సింగూరును త్యాగం చేసి ఇస్తున్నారు: ఈటల 
సీఎం కేసీఆర్, హరీశ్‌రావులు త్యాగం చేసి సింగూరు ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీకి జలాలను తరలించారని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. గతంలో ఎస్సారెస్పీలో 40 టీఎంసీల కంటే తక్కువగా లభ్యత ఉంటే.. గేట్లు తెరిచి నీళ్లు ఇవ్వలేదని, ఇప్పుడా నిబంధనను పక్కన పెట్టామని చెప్పారు. ఆయకట్టు చివరి రైతుకు కూడా నీళ్లు అందించేందుకు చర్యలు చేపడతామని, అవసరమైతే మూడు నెలల పాటు తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకుందామని ఈటల ప్రతిపాదించారు. ఇక గతేడాది నిజామాబాద్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన టెయిల్‌ టు హెడ్‌ నీటి సరఫరా విధానం విజయవంతమైందని, మిగతా ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement