చినుకు పడలే.. చెరువు నిండలే!

Water shortage in Krishna Basin - Sakshi

కృష్ణా బేసిన్‌లో ఖాళీగా చెరువులు

23,700 చెరువులకు 21,900 ఖాళీ

సరైన వర్షాలు లేక చుక్క నీరు రాని పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టు పరిధిలోని పెద్ద ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతుంటే.. చిన్న నీటివనరులైన చెరువులు మాత్రం నీటి కొరతతో అల్లల్లాడుతున్నాయి. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో దిగువ ప్రాజెక్టులకు ఊహించని రీతి లో వరద కొనసాగుతుండగా, సరైన వర్షాలు లేక చెరువులు ఓటికుండల్లా దర్శనమిస్తున్నాయి. బేసిన్‌ పరిధిలోని 23,700కు పైగా చెరువుల్లో 21,900 ఖాళీగానే ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తేగానీ నిండే అవకాశం లేదు.

వర్షపాతం తక్కువే..
కృష్ణా బేసిన్‌లోని నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదైంది. గతేడాదితో పోలిస్తే 30 నుంచి 50% తక్కువ వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో 50% తక్కువ వర్షపాతం నమోదవగా.. రంగారెడ్డిలో 39, జోగుళాంబ గద్వాల, సంగారెడ్డిలో 23, సూర్యాపేటలో 26, యాదాద్రి, మేడ్చల్‌లో 33% తక్కువ వర్షపాతం రికార్డయింది. దీంతో ఈ జిల్లాల పరిధిలోని చెరువుల్లో పెద్దగా నీరు చేరలేదు.  

ఖాళీగా 21,909 చెరువులు
నిజానికి కృష్ణా బేసిన్‌లో ఉన్న 23,704 చెరువులకు 89 టీఎంసీల మేర నీటి కేటాయింపులున్నాయి. కానీ ఇప్పటివరకు 21,909 చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కేవలం 1,339 చెరువుల్లో 25 నుంచి 50 శాతం మేర నీరు చేరగా 214 చెరువుల్లో 50 నుంచి 70 శాతం, 201 చెరువుల్లో 75 శాతానికి మించి లభ్యత ఉంది. 41 చెరువులే అలుగు పారుతున్నాయి. కృష్ణా బేసిన్‌లో ప్రధానంగా సిద్ధిపేట జిల్లాలో 3,256 చెరువుల్లో 3,222 చెరువుల్లో చుక్క నీరు లేదు.

మహ బూబ్‌నగర్‌ జిల్లాలోనూ 2,461 చెరువుల్లో ఒక్క చెరువులోకి నీరు చేరలేదు. మిగతా జిల్లాలోనూ ఇదే పరిస్థితి. భవిష్యత్తులో కురిసే వర్షాలపైనే ఈ చెరువులన్నీ ఆధారపడి ఉన్నాయి. గోదావరి పరిధిలో 20,121 చెరువుల్లో 8 వేల చెరువులు ఖాళీగా ఉన్నాయి. మిగ తా చెరువుల్లో 40 శాతం నీటి లభ్యత ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ రెండ్రోజుల్లోనే శ్రీశైలానికి 30 టీఎంసీల మేర నీరు చేరింది. ప్రవాహాలు పెరగడంతో 10 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top