నిన్న గ్రామం..నేడు పురం | Village Promoted To Municipality In Warangal | Sakshi
Sakshi News home page

నిన్న గ్రామం..నేడు పురం

Jan 12 2020 7:59 AM | Updated on Jan 12 2020 8:02 AM

Village Promoted To Municipality In Warangal - Sakshi

తొర్రూరులోని ముఖ్య కూడలి

సాక్షి, వరంగల్‌: మొన్నటి వరకు అది మేజర్‌ గ్రామ పంచాయతీ. ఉమ్మడి జిల్లాలోనే పెద్ద పంచాయతీగా పేరుంది. ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం కొత్త పురపాలికగా ఏర్పాటు చేసింది. ఇప్పుడు పట్టణం మునిసిపాలిటీగా మారి కొత్త రూపు సంతరించుకుంది. రూ.కోట్ల అభివృద్ధి పనులతో శరవేగంగా వృద్ధి చెందుతోంది. మంత్రి మానసపుత్రికగా పేరొందిన పట్టణంలో తొలిసారి పురపాలికగా ఏర్పడి దినదినాభివృద్ధి చెందుతున్నది.

గ్రామ ప్రశస్తి..
బృహత్‌శిలా యుగం, కొత్త రాతి యుగం నుంచే తొర్రూరుకు ఉనికి ఉందని చరిత్రకారులు గుర్తించారు. ఈ ఊరిలో ప్రముఖ దొర ఉండేవాడని, అతడి పేరు మీదనే ‘దొర వారి ఊరు’ అని తొలుత పిలిచేవారట. కాలగమనంలో ‘దొర వారి ఊరు’ కాస్తా ‘దొరూరు’ తర్వాత ‘తొర్రూరు’గా మారింది. గ్రామ నామంపై మరో కథనం సైతం ప్రచారంలో ఉంది. ఈ ఊరు మధ్యలో పెద్ద గొయ్యి ఉండేదని దాని వల్ల ‘తొర్ర’ ఊరు అని పిలిచేవారట. తొర్ర(గొయ్యి) ఉండడం వల్ల ‘రంద్రపురి’ అని కూడా పిలిచేవారట. ఇలా పలు పేర్లు గ్రామ నామంపై ప్రచారంలో ఉన్నాయి. 

పల్లె నుంచి పట్టణంగా మార్పు..
ఐదున్నర దశాబ్దాల క్రితం తొర్రూరు గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 1964లో గ్రామ పంచాయతీగా వెలుగులోకి వచ్చింది. వరంగల్, ఖమ్మంకు వెళ్లే రహదారిపై పట్టణం ఉండడంతో ఇక్కడ జనాభా క్రమక్రమంగా వృద్ధి చెందింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పెద్ద గ్రామ పంచాయతీగా పేరొందింది. 15 వేలకు పైగా ఉన్న పంచాయతీలను మునిసిపాలిటీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేయడంతో తొర్రూరు పురపాలికగా ఏర్పడింది. 2018 ఆగస్టు 1 నుంచి తొర్రూరు మునిసిపాలిటీగా పిలువబడుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 19,100 జనాభా ఉండగా ప్రస్తుతం 25వేలకు పైగా జనాభా ఉంది. 

1964లో నిర్వహించిన ఎన్నికల్లో తొలి సర్పంచ్‌గా పాకనాటి వెంకట్‌రెడ్డి ఎన్నికయ్యారు. 1970 వరకు ఆయన సర్పంచ్‌గా పనిచేశారు. 1971లో చాపల రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా పని చేశారు. తర్వాతి సర్పంచులుగా జక్కుల వీరారెడ్డి, కర్నె సోమయ్య, శొంటిరెడ్డి గోపాల్‌రెడ్డి, పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి, పెదగాని కళావతిలు సర్పంచులుగా పని చేశారు. చివరి సర్పంచ్‌గా «ధరావత్‌ రాజేష్‌నాయక్‌ కొనసాగారు. 

మునిసిపాలిటీలో అభివృద్ధి పనులు..
తొర్రూరు మునిసిపాలిటీగా ఏర్పడిన అనంతరం అభివృద్ధి వేగం పుంజుకుంది. రూ.70 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయి. రూ.13 కోట్లతో చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడం, రూ.6.20 కోట్లతో మోడల్‌ మార్కెట్, రూ.3 కోట్లతో యతిరాజారావు పార్కు అభివృద్ధి, సంతలో సౌకర్యాలకై రూ.1 కోటి, సీసీ రోడ్లకు రూ. 7కోట్లు, డ్రెయినేజీలకు రూ. 7 కోట్లు, సెంట్రల్‌ లైటింగ్, గ్రీనరీకి రూ.3 కోట్లు, రూ. 30 కోట్లతో డబుల్‌ బెడ్రూం ఇళ్లు వంటి పనులు పట్టణంలో కొనసాగుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు

పట్టణంలో కొనసాగుతున్నాయి. 
పంచాయతీలో 20.. పురపాలికలో 16..
తొర్రూరు మునిసిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 20 వార్డులు ఉండగా మునిసిపాలిటీగా ఏర్పడిన అనంతరం వాటి సంఖ్యను కుదించారు. తొలి మునిసిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్‌గా ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారు. 16 వార్డుల్లో ఎస్సీలకు 3 వార్డులు, ఎస్టీలకు 2, బీసీలకు 3, జనరల్‌కు 8 వార్డులు కేటాయించారు. తొలి ఎన్నికల్లో కౌన్సిలర్‌గా, చైర్మన్‌గా ఎన్నికై చరిత్రలో నిలవాలని పట్టణ వాసులు ఆశపడుతున్నారు. దీంతో తొలి పోరు రసవత్తరంగా మారింది.

ఆనందదాయకం.. 
మునిసిపాలిటీగా ఏర్పడడానికి ముందు సర్పంచ్‌గా పాలనా బాధ్యతలు నేను చేపట్టడం మరిచిపోలేను. తొర్రూరు దినదినాభివృద్ధి చెందుతోంది. దానిలో నా పాత్ర కొంత వరకు ఉంది అని భావిస్తున్నా. మునిసిపాలిటీగా ఏర్పడిన అనంతరం చైర్మన్, పాలకవర్గం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయాలి.
– ధరావత్‌ రాజేష్‌నాయక్, మాజీ సర్పంచ్, తొర్రూరు

సమర్థవంతంగా నిర్వహిస్తాం..
పట్టణంలో తొలిసారి జరుగుతున్న మునిసిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వార్డుల విభజన నుంచిపోలింగ్‌ వరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాం. పోలింగ్‌ కేంద్రాలు, కౌంటింగ్‌ సెంటర్లు అన్నీ ఏర్పాటు చేశాం. ఎన్నికల సిబ్బందిని నియమించాం.  
– గుండె బాబు, మునిసిపల్‌ కమిషనర్, తొర్రూరు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement