నిత్యావసరం.. నిత్య సమరం! | Sakshi
Sakshi News home page

నిత్యావసరం.. నిత్య సమరం!

Published Thu, Jul 2 2015 12:36 AM

నిత్యావసరం.. నిత్య సమరం! - Sakshi

సామాన్యుడిపై ధరాఘాతం
దిగిరానంటున్న పప్పులు, కూరగాయ ధరలు
పచ్చి మిర్చి, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు పైపైకి
రూ.120-130 మధ్యే పప్పులు
మూడురెట్లు పెరిగిన ఆకుకూరలు
 4 వేల హెక్టార్లకు గానూ
  వెయ్యి హెక్టార్ల సాగుకే ఉల్లి పరిమితం
ఇప్పటివరకు మిర్చి సాగు జాడే లేదు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పులు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సాగు చతికిలపడడంతో పచ్చి మిర్చి ధర నషాళాన్ని తాకుతోంది. ఉల్లి ఘాటెక్కిస్తోంది. ఇక అల్లం, వెల్లుల్లి ధరలైతే ఏకంగా పావు కిలో రూ.40కి చేరాయి. కొండెక్కిన పప్పుల ధరలు రూ.120-130తో మధ్య తచ్చాడుతున్నాయి. ఖరీఫ్ మొదలైనా ఆశించిన రీతిలో కాయగూరల సాగు జోరందుకోకపోవడం, పంటల విస్తీర్ణం ఆశాజనకంగా లేకపోవడంతో సామాన్యుడిపై ధరాఘాతం తప్పడం లేదు!
 
 ఉల్లి ఘాటు.. మిర్చి పోటు
 రాష్ట్రంలో డిమాండ్ మేరకు కూరగాయలు సరఫరా కాకపోవడంతో ధరలు భారీగా పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో టమాటా, వంకాయ, కాకరకాయ ధరలన్నీ కిలో రూ.30 వరకు ఉండగా, బెండకాయ రూ.40, బీరకాయ రూ.60, చిక్కుడు, క్యాప్సికం రూ.40 వరకు పలుకుతున్నాయి. రాష్ట్రంలో సాధారణంగా కూరగాయల సాగు 6 లక్షల ఎకరాలు. అయితే ఇప్పటివరకు 4 లక్షల్లోనే సాగయ్యాయి. ఉల్లి 10 వేల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా.. కేవలం రెండున్నర వేల ఎకరాలకే పరిమితమైంది. మిర్చి 1.45 లక్షల ఎకరాలకుగానూ ఇప్పటివరకు ఒక్క ఎకరంలోనూ సాగు కాలేదు. దీంతో గత నెల కిలో రూ.40 పలికిన పచ్చి మిర్చి ధర అమాంతం రూ.60కి పెరిగింది. ఉల్లి ధర నెలలోనూ రూ.20నుంచి రూ.30కి పెరిగింది. పప్పుల సాగు విస్తీర్ణం ఇంకా ఆశించిన మేర పుంజుకోలేదు. ఇప్పుడిప్పుడే 2.23 లక్షల హెక్టార్లలో సాగు మొదలైన దృష్ట్యా కందిపప్పు, మినప్పప్పు, పెసర పప్పు ధరలన్నీ ఇంకా రూ.120 నుంచి రూ.130 మధ్యే కొనసాగుతున్నాయి.
 
 ఆకుకూరల ధరలు మూడు రెట్లు
 ఆకుకూరల ధరలు రెండు నుంచి మూడు రెట్ల వరకూ పెరిగాయి. రెండు నెలల కిందటి వరకూ రూ.5 ఉన్న ఆకుకూరల కట్ట ఇప్పుడు రూ. 15కు పెంచేశారు. గోంగూర కట్ట రూ.5 నుంచి రూ.10కి పెరగ్గా, తోటకూర, బచ్చలాకు, చుక్కాకు, కొత్తిమీర ధరలు మూడు రెట్లు పెరిగాయి. రూ.5 ఇవ్వందే కరివేపాకు రెమ్మ కూడా ఇవ్వడం లేదు. రూ.5 ఉన్న పాలకూర కట్ట రూ. 10కి చేరింది. వేసవి వల్ల నీళ్లు లేక దిగుబడి పడిపోయిందని, అందువల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
 
 చికెన్ స్కిన్‌లెస్ రూ.190
 ఎన్నడూ లేనివిధంగా చికెన్, మటన్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. 15 రోజుల కిందటి వరకు స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.120 నుంచి రూ.130 వరకు ఉండగా అది ఇప్పుడు ఏకంగా రూ.190కి పెరిగింది. ఇది గతేడాది ధరతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు. మట న్ ధర కిలో రూ.480 ఉండగా రూ.550కి పెరిగింది. ఇప్పట్లో ఈ ధరలు సైతం తగ్గే అవకాశ ం లేదని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్య, దిగువ మధ్యతరగతి ప్రజలు మాంసాహారం దాదాపు మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది.
 

Advertisement
Advertisement