అరెస్ట్‌పై హైకోర్టుకు వరవరరావు

Varavara Rao to the High Court on his arrest - Sakshi

తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులకు హైకోర్టు నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్ర పోలీసులు తనను అరెస్ట్‌ చేయడాన్ని సవాలు చేస్తూ విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. వరవరరావు అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, చిక్కడపల్లి స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌లతోపాటు మహారాష్ట్ర విశ్రాంబాగ్‌ ఎస్‌హెచ్‌ఓలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

తన అరెస్ట్‌తోపాటు తనను పుణేకు తరలించేందుకు వీలుగా హైదరాబాద్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఈ ఏడాది ఆగస్టు 28న జారీచేసిన ట్రాన్సిట్‌ రిమాండ్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వరవరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది డి.సురేశ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ, ఆగస్టు 28న తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు కలిసి వరవరరావు ఇంటిలో సోదాలు నిర్వహించి, అరెస్ట్‌ చేస్తున్నట్లు చెప్పారన్నారు.

ఇలా మరికొందరిని కూడా  అరెస్ట్‌ చేశామని, తర్వాత వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని కోర్టుకు నివేదించారు. దీంతో అరెస్టయిన వారిలో ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారన్నారు. విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆ వ్యక్తి విడుదలకు ఆదేశాలిచ్చిందని, ఈ నేపథ్యంలో పిటిషనర్‌ కూడా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top