
నెలరోజుల పాటు వాగ్దేవి ల్యాబ్స్‌పై ఎంబీవీవీ పోలీస్ ఆఫీసర్ నిఘా.. పూర్తి వివరాలు సేకరించి మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం
పట్టుబడిన డ్రగ్స్ సీజ్.. 200 డ్రమ్ముల్లో ఉన్న కెమికల్స్ లారీల్లో ముంబైకి.. ఏడాది క్రితమే మహారాష్ట్రలో శ్రీనివాస్ విజయ్ వోలేటిపై డ్రగ్స్ కేసు
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ: వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో లేబర్‌గా చేరితేగానీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించలేమని భావించిన మహారాష్ట్ర పోలీసులు పక్కా పథకం వేశారు. దీంతో ఎంబీవీవీ క్రైమ్ బ్రాంచ్ యూనిట్–4కు చెందిన ఓ ఆఫీసర్ నెలరోజుల ముందే వాగ్దేవి ల్యాబ్స్‌లో కార్మికుడిగా చేరాడు. కంపెనీలో దిగుమతి అవుతున్న ముడి సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీ కేంద్రం, కార్మీకులు, రవాణా ఏర్పాట్లు తదితరాలపై నిఘా పెట్టారు. నెలరోజుల పాటు వివరాలు సేకరించి, పక్కా ఆధారాలు లభించగానే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎంబీవీవీ క్రైమ్ బ్రాంచ్ యూనిట్–4 ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ భడక్, తన బృందంతో ఆకస్మికంగా దాడులు చేసి గుట్టు రట్టు చేశారు.
ప్రతిసారి 5 కిలోల విక్రయం: భారీ మొత్తంలో డ్రగ్స్ తయారు చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు చిక్కిన శ్రీనివాస్ విజయ్ వోలేటి బృందం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు శ్రీనివాస్ విజయ్ పదేళ్లుగా ఎండీ (మెఫిడ్రోన్) డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్నట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రతిసారి కనీసం 5 కిలోల చొప్పున మెఫిడ్రోన్ డ్రగ్స్ విక్రయించేవాడని, ఒక్కొక్క కిలో రూ.50 లక్షల చొప్పున ఏజెంట్లకు విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు.
బంగ్లాదేశ్ యువతి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఏకంగా రూ.12వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలను మహారాష్ట్ర పోలీసులు ఈనెల 5న గుర్తించిన విషయం తెలిసిందే. చర్లపల్లి ఇండ్రస్టియల్ ఏరియాలోని నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్న నిర్వాహకుడు శ్రీనివాస్‌విజయ్ వోలేటి, అతడితో కలిసి పనిచేస్తున్న తానాజీ పండరినాథ్ పటా్వరీలను మిరా–భయందర్, వసాయ్–విరార్ (ఎంబీవీవీ) పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.
ఈ సోదాల్లో భాగంగా స్వాదీనం చేసుకున్న 5 కిలోల 968 గ్రాముల ఎండీ (మెఫిడ్రోన్), 35,500 లీటర్ల ఇతర కెమికల్స్, 19 బాక్స్‌లలోని 950 కిలోల మిౖథెలిన్ డైక్లోరైడ్ (ఎండీసీ) పొడి సహా మెఫిడ్రోన్ (ఎండీ) తయారీకి వాడే ఇతర రసాయనాలు కలిపి మొత్తం 200 డ్రమ్ముల్లో ఉన్న కెమికల్స్‌ను, నాచారంలోని వాగ్దేవి ఇన్ఫోసైన్స్‌లో భారీగా నిల్వచేసిన డ్రగ్ పౌడర్‌ను ఆదివారం రెండు లారీల్లో ముంబైకి తరలించారు.
శ్రీనివాస్‌విజయ్ ఓలేటి, తానాజీ పండరినాథ్ పటా్వరీలను కస్టడీకి తీసుకొని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో పట్టుబడిన 11 మంది నిందితుల నుంచి సేకరించిన వివరాలతోపాటు వీరిద్దరిని కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. కాగా, డ్రగ్స్ పట్టుబడిన ఫ్యాక్టరీ ప్రాంతంలో స్థానిక పోలీసులు సైతం ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
ఏడాది క్రితమే ఓలేటిపై డ్రగ్స్ కేసు
తాజా డ్రగ్స్ కేసులో పట్టుబడిన శ్రీనివాస్‌విజయ్ ఓలేటి పాత నేరస్తుడేనని ఎంబీవీవీ క్రైమ్ బ్రాంచ్ యూనిట్–4 ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ భడక్ ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడని, కేసు నమోదైందని చెప్పారు. ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చి, మళ్లీ హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్టు బంగ్లాదేశ్ యువతి అరెస్టుతో వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
కొన్నేళ్లుగా హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాలతోపాటు బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ విజయ్ ఓలేటి హైదరాబాద్ కేంద్రంగా వాగ్దేవి ల్యాబ్స్‌తో పాటు వాగ్దేవి ఇన్నోసైన్స్, అటెంటివ్ టెక్నాలజీస్ ప్రై.లి. కంపెనీలను సైతం నిర్వహిస్తున్నాడు.
డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీలపై ఫోకస్
హైదరాబాద్ శివారులో గుట్టుచప్పుడు కాకుండా ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను ఒక కెమికల్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో నడుపుతుండడం సంచలనంగా మారింది. దీంతో అప్రమత్తమైన రాచకొండ పోలీసులు, ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్), హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ), డీసీఏ (డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్) సిబ్బంది అప్రమత్తమైంది.
రసాయన ఫ్యాక్టరీలపై నిఘా పెంచాయి. కెమికల్ ఫ్యాక్టరీల పేరిట అనుమతులు తీసుకొని వాటిల్లో ఏం తయారు చేస్తున్నారు? మూతపడిన పరిశ్రమలు, రసాయన గోదాంల ప్రస్తుత పరిస్థితి ఏంటి ? వాటిలో ఏం నిల్వ చేస్తున్నారన్న అంశాలపై దృష్టి పెట్టారు.
నగరంలో మత్తుపదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీలపై ఇప్పటికే దృష్టి పెట్టామని, గతంలోనూ ఆ్రల్ఫాజోలం, ఎఫిడ్రిన్ సహా ఇతర మత్తు పదార్థాలను గుర్తించిన ఘటనలు ఉన్నాయని ఈగల్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీల్లో సోదాలు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) పరిధిలోకి వస్తాయని, డీసీఏతో కలిసి ఈగల్ బృందాలు సైతం ఈ రకమైన సోదాల్లో పాల్గొంటున్నాయని చెప్పారు.