24 ఏళ్లకే ఐఏఎస్‌.. మున్సిపల్‌ కమిషనర్‌గా

Valluri Kranthi Appointed As Karimnagar Municipal Commissioner - Sakshi

సాక్షి, కరీంనగర్‌: దేశంలో చిన్న వయస్సులో ఐఏఎస్‌ సాధించిన వారిలో వెల్లూరి క్రాంతి కూడా ఒకరు. 24 ఏళ్లకే ఐఏఎస్‌ సాదించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే గర్వకారణంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌ జిల్లాకు చెందిన వల్లూరి రంగారెడ్డి, లక్షి్మలకు ఇద్దరు కుమార్తెలు నీలిమా, క్రాంతి ఉన్నారు. క్రాంతి తల్లిదండ్రులు, అక్క అందరూ వైద్యులే. తల్లిదండ్రులు కర్నూల్‌లో వైద్యులుగా స్థిరపడగా, అక్క నీలిమా అమెరికాలో ఉంటున్నారు. ఇంట్లో అందరూ వైద్యులుగా ఉండడంతో క్రాంతిని చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేసే సర్వీసులో ఉండాలని, అందుకోసం ఐఎఎస్‌ సాధించాలని తండ్రి రంగారెడ్డి చెప్పేవారు. 10వ తరగతి వరకూ కర్నూల్‌లో, ఇంటర్‌ హైదరాబాద్‌లో పూర్తి చేయగా ఐఐటీ సీట్‌ రావడంతో ఢిల్లీ ఐఐటీలో చేరారు. అక్కడి నుంచి ఐఏఎస్‌ కావాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఆరునెలలపాటు శిక్షణ పొందుతూ ప్రిపరేషన్‌ ప్రారంభించారు. 2013లో మొదటిసారి సివిల్స్‌ రాసి మొదటి ప్రయత్నంలోనే 562 ర్యాంక్‌ సాధించారు. ఐఆర్‌టీఎస్‌(ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌)లో జాయిన్‌ అయి వడోదర, లక్నోల్లో శిక్షణ కూడా పొందారు. 2014లో రెండవసారి మళ్లీ సివిల్స్‌ పరీక్షలు రాశారు. ఈసారి 230 ర్యాంక్‌ సాధించారు. ఐఆర్‌ఎస్‌(ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌) వచ్చింది. 2015లో మళ్లీ సివిల్స్‌ రాశారు. 2016లో ప్రకటించిన తుది ఫలితాల్లో 65 ర్యాంక్‌తో ఐఏఎస్‌ సాధించారు. ఇలా 24 ఏళ్లకే ఐఏఎస్‌ సాధించి రికార్డ్‌ సృష్టించారు. శిక్షణ అనంతరం క్రాంతిని తెలంగాణ క్యాడర్‌కు కేటాయించారు. అలా మొదట నిర్మల్‌ జిల్లాలో పని చేశారు. అనంతరం ప్రత్యేకాధికారిగా మహబూబ్‌నగర్‌లో 15 నెలలపాటు పని చేయగా తాజాగా జరిగిన బదిలీల్లో కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా వచ్చారు.  

ఆటలన్నా.. పాటలన్నా ఇష్టం...
వల్లూరి క్రాంతికి ఆటలన్నా పాటలన్నా చాలా ఇష్టమని పలు సందర్భాల్లో వెల్లడించారు. చిన్నపుడు బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ అయిన క్రాంతి తర్వాత టెన్నిస్, బ్యాడ్మింటన్‌ బాగా ఆడుతారు. ప్రముఖుల బయోగ్రఫీ పుస్తకాలు ఇష్టంగా చదువుతారు. వీటితోపాటు తెలంగాణ పాటలను బాగా ఇష్టపడుతారు. ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం, సంస్కృతిపైన వచ్చిన పలు జానపదాలను ఇష్టంగా వింటారు. బతుకమ్మ పండుగను బాగా ఇష్టపడుతారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top