నీళ్లు లేవు.. నీడా లేదు!

Upadi Hami Pathakam Drinking Water Problems - Sakshi

నల్లగొండ : వేసవిలో ఇతర పనులు దొరకని పరిస్థితి. అలాంటి వారు వలస వెళ్లకుండా, కుటుంబ పోషణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్ద సౌకర్యాలు కరు వయ్యాయి.  అసౌకర్యాల నడుమ కూలీలు పనులు చేస్తున్నారు. పనిచేసే చోట కూలీలకోసం టెంట్లు  ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. అధికారులు తాము అన్ని గ్రూప్‌లకు టెంట్లు ఇచ్చామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.  జిల్లాలో మొత్తం 8,76,807 మంది ఉపాధి హామీ కూలీలు నమోదై ఉన్నారు.

3,69,000 జాబ్‌కార్డులు ఉన్నాయి. వేసవిలో ప్రత్యేక పనుల కోసం అధికారులు ఇటీవల ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ అనుమతి పొందారు. ఏప్రిల్‌ 2019 నుంచి మార్చి 2020 వరకు 77 లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని తప్పనిసరిగా కల్పించాల్సి ఉంది. ఇందుకు సుమారు 240 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించారు.  ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలో ఉపాధి హామీ పనులను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కూలీలకు 5 లక్షల పనిదినాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. చేసిన పనులకుగాను 9 కోట్ల రూపాయలను కూలీల ఖాతాలో జమచేసినట్లు అధికారులు తెలుపుతున్నారు.

భానుడి విశ్వరూపం..
ఎండాకాలంలో భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఇంకుడుగుంతలు, కందకాలు, చెరువుల పూడిక, చెట్ల తొలగింపు, నర్సరీలు, కాల్వ పూడిక తదితర పనులు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ సుర్రుమంటోంది. కూలీలు ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఎండ తీవ్రంగా ఉండడంతో ఉదయం పూట వెళ్లి పనులు చేస్తున్నారు.  ఉపాధి నిబంధనల ప్రకారం కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. అధికారులు ఎప్పుడో గ్రామాల వారీగా అందించారు. ఎక్కడా అటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. అసలు అవి ఉన్నాయా లేవా అన్నది తెలియని పరిస్థితి.. దీంతో కూలీలు చెట్లకింద సేదదీరుతున్నారు. కూలీలే తట్టలు, మంచి నీరు కూడా తెచ్చుకుంటున్నారు. అందుకు అధికారులు డబ్బులు చెల్లిస్తున్నామని చెబుతున్నారు.  

సౌకర్యాలు లేవు
మే
ము పక్షం రోజులుగా కడపర్తి పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్నాం. మంచీనటి సౌకర్యం కూడా లేదు. కనీసం టెంట్లు కూడా వేయలేదు. పనులు చేసేందుకు గడ్డపారలు కూడా ఇవ్వలేదు. ఎండకు ఎండుతూ ఉపాధి హామీ పనులు చేస్తున్నాం... – నూనె లింగయ్య, ఉపాధి కూలీ, కడపర్తి, నకిరేకల్‌ 

ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లు పెట్టాలి
ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాలలో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లు కూడా ఇవ్వాలి. వడదెబ్బకు గురైనప్పుడు కూలీలకు ఇబ్బందులు ఎదురవుతాయి. పని చేస్తున్న ప్రదేశాలలో టెంట్లు కూడా వేయాలి.  – జీడిపల్లి లక్ష్మమ్మ, ఉపాధి హామీ మేట్, కడపర్తి, నకిరేకల్‌ మండలం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top