‘నిరుద్యోగ భృతి’ని ప్రారంభించండి

Unemployment Rate Will Be Doubled Due To Lockdown: Uttam - Sakshi

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ‘నిరుద్యోగ భృతి’పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రైవేటు రంగ ఉద్యోగులను తొలగించకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బుధవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ‘అనేక ఐటీ కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. అనేక ప్రైవేట్‌ సంస్థలు ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతలు విధించాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. లాక్‌డౌన్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కనీసం ఒక సంవత్సరం వరకు పరిస్థితి మెరుగుపడకపోవచ్చు. ఈ సమయంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 భృతి కింద ఇవ్వాలి’అని ఆ ప్రకటనలో ఉత్తమ్‌ కోరారు. చదవండి: ‘టిమ్స్‌’కు రూ.50 లక్షల ఎంపీ ల్యాడ్స్‌: రేవంత్‌ రెడ్డి

లాక్‌డౌన్‌ తర్వాత తెలంగాణలో నిరుద్యోగ యువకుల సంఖ్య రెట్టింపు అవుతుందని, తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో నమోదైన దాదాపు 24 లక్షలతో సహా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువతతో.. తెలంగాణ రాష్ట్రం రాబోయే కొద్ది నెలల్లో నిరుద్యోగ గణాంకాలలో భారీ పెరుగుదలను చూడబోతోందని, ఈ పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెండవ దశ లాక్‌డౌన్‌ ముగియడానికి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఉత్తమ్‌ ఆ ప్రకటనలో కోరారు. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం తీసుకురావాలని, తెలంగాణలో కరోనా వైరస్‌ పరిస్థితిపై నివేదిక విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top