నిరుద్యోగ భృతిపై నిరాశేనా?

Unemployment Increasing In Adilabad - Sakshi

సాక్షి, తాంసి(బోథ్‌): జిల్లాలో నిరుద్యోగం పెరిగిపోతోంది. ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో యువతలో నిరుత్సాహం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాని అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా నేటికీ నిరుద్యోగ భతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టింది. తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం అమలు కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం అర్హులైన నిరుద్యోగులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది.

దారిద్రరేఖకు దిగువన ఉండి తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండి, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన, వయస్సు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న నిరుద్యోగ యువతకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి కావలసిన అర్హతలు సైతం పేర్కొంది. అర్హులైన ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3016 అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం బడ్జెట్‌లో సైతం నిధులను కేటాయించింది.

కానీ ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఎటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్‌ లేకపోవడం, మరోవైపు నిరుద్యోగ భృతి అందకపోవడంతో పూట గడవడం కష్టంగా మారుతుందని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

రుణాలు సైతం అందక ఇబ్బందులు
జిల్లాలో నిరుద్యోగుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారింది. ఓ వైపు నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు వెలువడకపోవడం, నిరుద్యోగ భృతి అందని ద్రాక్షగా మారడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూటగడవడం కష్టంగా మారిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోగా ఇందులో కేవలం గ్రామానికి ఇద్దరు, ముగ్గురికి మాత్రమే ఇస్తున్నారు. బడ్జెట్‌ లేదనే కారణంతో అందరికీ రుణాలు అందడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే చివరికి ఆ రుణాలు కూడా అందకపోవడంతో యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

నిరుద్యోగ భృతి ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతీయువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకోవాలి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం 
స్పందించాలి. – నగరం అశోక్, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top