సాగర్‌ కుడి కాల్వకు రెండు టీఎంసీలు 

Two TMC Water To Nagarjuna Sagar Right Canal - Sakshi

ఏపీ తాగునీటి అవసరాలు తీర్చేందుకు తెలంగాణ అంగీకారం

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో నిర్ణయం

సాక్షి,హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని నాగార్జున సాగర్‌ కుడి కాల్వ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు అనుమతించింది. కరోనా నేపథ్యంలో కుడి కాల్వ కింద గృహావసరాలకు నీటి వినియోగం పెరిగినందున తమకు తక్షణమే నీటిని విడుదల చేయాలన్న ఏపీ వినతికి తెలంగాణ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ నీటి విడుదలకు ఓకే చెబుతూ శుక్రవారం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఉత్తర్వులు జారీ చేశారు. సాగర్‌ కుడి కాల్వ తాగునీటి అవసరాలపై చర్చించేందుకు పరమేశం అధ్యక్షతన జలసౌధలో త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది.

ఈ భేటీకి ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు నారాయణరెడ్డి, మురళీధర్‌లు హాజరయ్యారు. సాగర్‌కుడి కాల్వ కింద ఇప్పటికే ఏపీ వినియోగం పూర్తయిందని, దీనిపై ఇదివరకే బోర్డు ఏపీకి లేఖ రాసిన విషయాన్ని తెలంగాణ ఈఎన్‌సీ గుర్తు చేశారు. అయితే ఈ లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని, తమ వినియోగ లెక్కలు, బోర్డు చెబుతున్న లెక్కలకు పొంతన లేదని ఏపీ ఈఎన్‌సీ తెలిపారు. వినియోగ లెక్కలపై మరో భేటీలో చర్చిద్దామని, ప్రస్తుత అవసరాల దృష్ట్యా నీటిని విడుదల చేయాలని కోరగా...బోర్డు అందుకు అంగీకరించింది. కనీస నీటి మట్టం దిగువకు వెళ్లే అంశంపైనా చర్చ జరిగినా, ఆ అవసరం లేదని బోర్డు అభిప్రాయపడినట్లుగా తెలిసింది. ఈ నీటిని ఈ నెల 31 వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది.

బోర్డు లేఖలో పరిపక్వత లేదు: నారాయణరెడ్డి, ఏపీ ఈఎన్‌సీ 
బోర్డు భేటీ అనంతరం ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ..రెండు టీఎంసీల నీటి విడుదలకు తెలంగాణ అంగీకరించిందన్నారు. ఇప్పటికే తమ వాటా వినియోగం పూర్తయిందన్న బోర్డు లెక్కల్లో పరిపక్వత లేదని చెప్పారు. సాగర్‌ కింద గతంలో చాలా మార్లు 502 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకున్న సందర్భాలున్నాయని, అయితే ప్రస్తుతం ఆ అవసరం రాదని స్పష్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top