ఆస్తులు, ఉద్యోగుల పంపిణీపై ముందడుగు | Two telugu states to make combind on Properties, employees distribute | Sakshi
Sakshi News home page

ఆస్తులు, ఉద్యోగుల పంపిణీపై ముందడుగు

Jul 24 2016 3:24 AM | Updated on Sep 27 2018 5:59 PM

ఆస్తులు, ఉద్యోగుల పంపిణీపై ముందడుగు - Sakshi

ఆస్తులు, ఉద్యోగుల పంపిణీపై ముందడుగు

రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో తొమ్మిదో షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, ఉద్యోగుల పంపిణీపై రెండు రాష్ట్రాలు ముందడుగు వేశాయి.

-     సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేసిన ఉభయ రాష్ట్రాలు
-     పదో షెడ్యూల్ సంస్థలపై కేంద్రం మరో కమిటీ
-     హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో తొమ్మిదో షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, ఉద్యోగుల పంపిణీపై రెండు రాష్ట్రాలు ముందడుగు వేశాయి. ఇందులో భాగంగా తొమ్మిదో షెడ్యూల్‌లోని 91 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, ఉద్యోగుల పంపిణీకి ఉభయ రాష్ట్రాలు సంయుక్తంగా కమిటీని ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ సంయుక్త డెరైక్టర్ సాధు సుందర్, తెలంగాణ ప్రభుత్వం పునర్విభజన విభాగం కార్యదర్శి రామకృష్ణారావు, ఐఎఫ్‌ఎస్ అధికారి తిరుపతయ్యలతో కూడిన కమిటీ తొమ్మిదో షెడ్యూల్‌ల్లోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, ఉద్యోగుల పంపిణీ పూర్తి చే యనుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపిణీపై కేంద్రం ఏర్పాటు చేసిన షీలాభిడే కమిటీ 61 సంస్థల ఆస్తుల పంపిణీని పూర్తి చేసింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఇరు రాష్ట్రాలు ఆస్తుల పంపిణీని చేసుకోవాల్సి ఉంది.
 
 అయితే ఆస్తుల పంపిణీ పూర్తయితే తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన ఉద్యోగులను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు  కేటాయిస్తుందనే భావనతో ఏపీ ప్రభుత్వం ఆస్తుల పంపిణీ పక్రియను నిలుపుదల చేసింది. ట్రాన్స్‌కోలో ఏపీ స్థానికత చెందిన ఉద్యోగులందరినీ తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడంతో మిగతా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను అలాగే చేస్తే ఆయా ప్రభుత్వ రంగ సంస్థలపై ఆర్థిక భారం పడుతుందనే భావనతో ఏపీ ప్రభుత్వం ఆస్తుల పంపిణీతోపాటే ఉద్యోగుల పంపిణీ కూడా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరింది. అయితే ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఆస్తులు, ఉద్యోగుల పంపిణీని ఆయా ప్రభుత్వ రంగ సంస్థల్లో చేపట్టాలని నిర్ణయించాయి.  
 
 పదో షెడ్యూల్ సంస్థలపై కేంద్ర కమిటీ
 పదో షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కారం కానందున సుప్రీం కోర్టు తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుంచి ఇద్దరేసి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. హెడ్ క్వార్టర్స్ అంటే రాష్ర్ట విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్వచనం పేర్కొనలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరిన నేపథ్యంలో హెడ్ క్వార్టర్స్ అంటే నిర్వచనం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ఆ నిర్వచనంపై న్యాయస్థానాలను ఆశ్రయించరాదని రెండు రాష్ట్రాలకు కేంద్రం సూచించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement