సైఫ్‌ అలీ ఖాన్‌కు చుక్కెదురు.. చేజారిన రూ.15 వేల కోట్లు | Madhya Pradesh High Court Rejects Saif Ali Khan Plea Against Move To Label Ancestral Assets, More Details Inside | Sakshi
Sakshi News home page

సైఫ్‌ అలీ ఖాన్‌కు హైకోర్టులో చుక్కెదురు.. చేజారిన రూ.15 వేల కోట్లు

Jul 5 2025 11:44 AM | Updated on Jul 5 2025 1:05 PM

Court rejects Saif ali khan plea against move to label ancestral assets

భోపాల్‌లోని పూర్వీకుల ఆస్తులకు సంబంధించి సైఫ్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. తన ముత్తాత పాకిస్తాన్‌కు వలస వెళ్లిన కారణంగా రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులను "శత్రువుల ఆస్తి"గా న్యాయస్థానం గుర్తించింది. సైఫ్ అలీ ఖాన్, ఆయన సోదరీమణులు సోహా, సబా, తల్లి షర్మిలా ఠాగూర్ తమ పూర్వీకుల ఆస్తులకు వారసులుగా గుర్తించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో వారు రూ. 15 వేల కోట్ల ఆస్తులపై హక్కులను కోల్పోయారు.

సైఫ్ అలీ ఖాన్ ఆస్తి వారసత్వ వివాదాన్ని కొత్తగా విచారించాలని, ఒక సంవత్సరం కాలపరిమితిని నిర్ణయించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. 1947లో విభజన తర్వాత పాకిస్తాన్‌కు వలస వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవడానికి 1968 నాటి శత్రు ఆస్తి చట్టం అనుమతిస్తుందని హైకోర్టు గుర్తుచేసింది.

రూ. 15 వేల కోట్ల ఆస్తి స్టోరీ ఎంటి..?
బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్‌ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన  హమీదుల్లాహ్‌ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్‌ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్‌ న్యాయవాది జగదీశ్‌ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది.

స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్‌ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్‌ హమీదుల్లాహ్‌ చివరి నవాబ్‌గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్‌ బేగమ్‌కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్‌కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్‌లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్‌ చెబుతోంది.

ప్రభుత్వ వాదనను సైఫ్‌కు సంబంధించిన లాయర్‌ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్‌కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్‌ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్‌ బేగమ్‌ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ(టైగర్‌ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్‌ అలీ ఖాన్‌ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు.

తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్‌ చేస్తూ టైగర్‌ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్‌ నటి షర్మిలా ఠాకూర్‌ 2015లో మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్‌ 13న జస్టిస్‌ వివేక్‌ ఆగ్రావాల్‌ విచారణ చేపట్టారు. సైఫ్‌ తల్లి షర్మిలా వేసిన పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చిందని న్యాయస్థానం తెలిపింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్‌ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు. అయితే, తాజాగా పూర్తి విచారణ తర్వాత  ఆ రూ. 15 వేల కోట్ల ఆస్తలు  'శత్రువుల ఆస్తి'గానే గుర్తించాలని కోర్టు పేర్కొంది. కానీ, ఒక సంవత్సరంలోపు మళ్లీ పూర్తి విచారణ జరపాలని న్యాయస్థానం సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement