
మా తప్పు కూడా ఉంది: అస్మిత
తనను వేధించిన పోకిరీలపై తాను ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు స్పందించడం అభినందనీయమని టీవీ నటి అస్మిత అన్నారు.
హైదరాబాద్: తనను వేధించిన పోకిరీలపై తాను ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు స్పందించడం అభినందనీయమని టీవీ నటి అస్మిత అన్నారు. తనను వేధించిన ఇద్దరు ఆకతాయిలు అరెస్ట్ అయ్యారన్న సంగతి మీడియా ద్వారానే తెలిసిందని ఓ టీవీ చానల్ తో చెప్పారు. తనను వేధించిన పోకిరీలను తన కారులోంచి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశానని ఆమె వెల్లడించారు. అలాగే 'షీ' వెబ్ సైటులోనూ పెట్టానని చెప్పారు. అవేర్ నెస్ పెంచాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశానని అన్నారు.
ఇంతకుముందు రెండుమూడు సార్లు పోకిరీల బారిన పడ్డానని అప్పుడు ఏమీ చేయలేకపోయానని వెల్లడించారు. గత అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో బైకుపై వెళుతూ తనను వేధించిన ఇద్దరు ఆకతాయిల ఫోటోలు తీశానని వివరించారు. తాను ఫోటోలు తీస్తున్నానన్న భయం లేకుండా నవ్వుతూ ఫోజులు పెట్టారని, అందుకే వారి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టానని తెలిపారు.
దీనిపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని అన్నారు. తమవైపు నుంచి కూడా తప్పు ఉందని వ్యాఖ్యానించారు. పోకిరీల బారిన పడుతున్న మహిళలు ఫిర్యాదు చేయకపోవడంతో వారి ఆటలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని అస్మిత సూచించారు.