సమ్మెకు దిగితే వేటు!

TS Transco Warns Usage Of ESMA On Contract Employees - Sakshi

విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులకు ట్రాన్స్‌కో హెచ్చరిక

సమ్మె అక్రమమని, ఎస్మా ప్రయోగిస్తామని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్ ‌: ఉద్యోగాల క్రమబద్ధీకరణతో సహా మొత్తం 16 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జారీ చేసిన నోటీసులపై తెలంగాణ ట్రాన్స్‌కో తీవ్రంగా స్పందించింది. పారిశ్రామిక వివాదాల చట్టం–1947 విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగుల (ఆర్టిజన్లు)కు వర్తించదని, సమ్మెకు దిగడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. తక్షణమే సమ్మె పిలుపును వెనక్కి తీసుకోవాలని కోరింది. కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగితే నోటీసులు, వేతనాలు ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించే అధికారం రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఉందని హెచ్చరించింది.

తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జారీ చేసిన సమ్మె నోటీసుకు బదులిస్తూ ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు గురువారం యూనియన్‌ ప్రధాన కార్యదర్శికు లేఖ రాశారు. సమ్మెకు దిగడం, ఇతరులు సమ్మెకు దిగేలా రెచ్చగొడితే సంస్థ నిబంధనల ప్రకారం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో అన్ని రకాల సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు.

విద్యుత్‌ సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగులను విలీనం చేస్తూ గతంలో యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు నిలుపుదల చేసిందని, ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరడం న్యాయస్థానాన్ని ధిక్కరించడమేనని తప్పుపట్టారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగులు ఎస్మా పరిధిలోకి రారని, వారిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలకు లేదని కార్మిక నేతలు పేర్కొంటున్నారు.  

గ్రేడ్‌–4 ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు..
విద్యుత్‌ సంస్థల్లో నైపుణ్యం కలిగిన పనులు చేస్తున్న గ్రేడ్‌–4 ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్సును మంజూరు చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు విద్యుత్‌ ఉద్యోగులను వారి విద్యార్హతల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో వరుసగా గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, గ్రేడ్‌–3, గ్రేడ్‌–4 ఆర్టిజన్లుగా విద్యుత్‌ సంస్థలు విలీనం చేసుకున్నాయి.

కాంట్రాక్టు ఉద్యోగులుగా నైపుణ్యంతో కూడిన పనులు చేసినా సరైన విద్యార్హతలు లేకపోవడంతో విలీన ప్రక్రియలో కొందరు విద్యుత్‌ ఉద్యోగులను ఆర్టిజన్‌ గ్రేడ్‌–4గా నియమించారు. దీంతో వారు కాంట్రాక్టు ఉద్యోగిగా పొందిన వేతనం కంటే విలీనం తర్వాత వారికి వచ్చే వేతనం తగ్గిపోయి తీవ్రంగా నష్టపోయారు. గత వేతనానికి సమానంగా ప్రస్తుత వేతనం పెంచేందుకు గ్రేడ్‌–4 ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్సును మంజూరు చేశారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లు సైతం వర్తింపజేయనున్నాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top