‘డేంజర్‌’ డ్రైవర్స్‌!

TS RTC Private Drivers Accident Cases files in Hyderabad - Sakshi

ఆర్టీసీలో బెంబేలెత్తిస్తున్న ప్రైవేట్‌ డ్రైవర్లు

బస్సుల నిర్వహణలో సాంకేతిక చిక్కులు

11వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

బస్‌భవన్‌ సహా అన్ని చోట్ల ఆందోళనలు  

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీలో ప్రైవేట్‌ డ్రైవర్లు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని గందరగోళంనెలకొంది. పలుచోట్ల డ్రైవర్లు బస్సులను సక్రమంగా నడపలేకపోతుండడంతో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో డ్రైవర్లను, కండక్టర్‌లను డిపోలకు తరలిస్తున్నారు. హెవీ డ్రైవింగ్‌ లైసెన్సు ఉంటే చాలు. పెద్దగా అనుభవం, నైపుణ్యం లేకపోయినా సరే బస్సులను అప్పగిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వివిధ డిపోల్లో సుమారు 1500 మంది తాత్కాలిక డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం   లారీలు, ట్రాక్టర్‌లు, తదితర సరుకు రవాణా వాహనాలను నడిపిన వారే ఉన్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన  వ్యక్తం చేస్తున్నాయి. సిటీ బస్సులు నడిపేందుకు ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ అవసరమని, అలాంటి శిక్షణ కొరవడిన  వ్యక్తులు బస్సులు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌  ప్రధానకార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌ ఆరోపించారు. తాత్కాలిక డ్రైవర్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మద్యం సేవించి బస్సులు నడపడం, అదుపు తప్పి డివైడర్‌లకు ఢీకొట్టడం లేదా ముందు బస్సులను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హయత్‌నగర్, కూకట్‌పల్లిలో జరిగిన ప్రమాదాలు ప్రయాణికులను, వాహనదారులను భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే.

ఓల్వోలు ఎలా అప్పగించాలి...

ఈ క్రమంలో సమ్మె మరి కొంత కాలం ఇలాగే కొనసాగితే నాన్‌ ఏసీ లోఫ్లోర్, ఏసీ మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులను తాత్కాలిక డ్రైవర్లకు అప్పగించడంపై ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే బస్సుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాత్రి సర్వీసులను నిలిపివేశారు. ఒకవేళ తప్పనిసరిగా పూర్తిస్థాయిలో అన్ని బస్సులను నడపవలసి వస్తే ఎలా అనేది  ఇప్పుడు ఆర్టీసీ అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది.

11వ రోజుకు చేరిన సమ్మె..
ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. బస్‌భవన్‌ వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ఐ, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు చేపట్టిన  ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.అలాగే మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ష్టేషన్‌లు, డిపోల వద్ద  కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సమ్మె కారణంగా నిలిచిపోయిన బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి పూట బస్సులు లేకపోవడంతో  ప్రైవేట్‌ వాహనాలు పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top