నేడే ప్రజా ఆశీర్వాద సభ

TRS Party Praja Ashirvada Sabha At Husnabad - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ : సెంటిమెంట్‌ ఖిల్లా.. కరీంనగర్‌ జిల్లా నుంచే గుళాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల నగారా మోగించనున్నారు. మొదటి నుంచి తనకు సెంటిమెంట్‌ జిల్లా అని చెప్పుకునే ఆయన ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. గురువారం అసెంబ్లీ రద్దు తర్వాత ముందస్తు ఎన్నికలకు తెర లేసింది. అంతకుముందే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు అధినేత సంకేతాలు ఇచ్చారు.  శుక్రవారం హుస్నాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కలిసొచ్చిన సెంటిమెంట్‌ కోట.. కరీంనగర్‌ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించే ‘ముందస్తు’ సభ కోసం ఉమ్మడి కరీంనగర్‌లోని హుస్నాబాద్‌ను వేదికగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రజా ఆశీర్వాద సభ నుంచే శంఖారావం..
సెంటిమెంట్‌ ఖిల్లా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ పేరిట నేడు నిర్వహించే బహిరంగ సభ నుంచి కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం మోగించనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మూడు రోజులుగా హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణపై మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ సిద్దిపేటలో ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహించారు. హుస్నాబాద్‌లో సభ నిర్వహణకు ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సతీష్‌రావుతోకలిసి వారు స్థల పరిశీలన, ఏర్పాట్ల పర్యవేక్షణ చేశారు. చివరకు హుస్నాబాద్‌ ఆర్టీసీ బస్‌డిపో స్థలంలో సభ నిర్వహించాలని నిర్ణయించి వేదిక ఏర్పాటు చేశారు.

ప్రజా ఆశీర్వాద సభ కోసం మండలాల వారీగా ఇన్‌చార్జీలను నియమించి కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్‌ అర్బన్, సిద్దిపేట జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేశారు. మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ ప్రజాప్రతినిధుల సహకారంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాయకులతో జన సమీకరణపై కసరత్తు చేశారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలో సీఎం కేసీఆర్‌ హాజరయ్యే భారీ సభకు 65 వేల మందిని సమీకరించే వీలుగా వాహనాలను సమకూర్చారు.

జన సమీకరణలో నిమగ్నం..
హుస్నాబాద్‌లో కేసీఆర్‌ సభను జయప్రదం చేసేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు సర్వశక్తులొడ్డారు. చిగురుమామిడి మండలానికి కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సైదాపూర్‌ మండలానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కోహెడకు మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్, అక్కన్నపేటకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, భీమదేవరపల్లికి ఎమ్మెల్యే పుట్ట మధు, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డి, ఎల్కతుర్తికి మెట్‌పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, హుస్నాబాద్‌ టౌన్, రూరల్‌కు నీటిపారుదల మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీష్‌రావు, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్, పాతూరి సుధాకర్‌రెడ్డి ఇన్‌చార్జీలుగా వ్యవహరించారు.

ఈ మేరకు 5, 6 తేదీల్లో ఆయా మండలాల్లో విస్తృతంగా మండల పార్టీ సమావేశాలు నిర్వíßహించారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నిర్వహించే సభను పార్టీ నేతలు, శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు, భారీ సంఖ్యలో జనాన్ని తరలించేందుకు నేతలు కృషి చేశారు. ఎన్నికలకు ముందు నిర్వహించే తొలిసభ విజయవంతంలో అందరూ తలమునకలయ్యారు.  

విజయవంతం చేయండి
సైదాపూర్‌(హుజూరాబాద్‌) : టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, బంగారు తెలంగాణ నిర్మాణానికి కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ అన్నారు. మండల కేంద్రంలో గురువారం పార్టీశ్రేణులతో కలిసి హుస్నాబాద్‌లో శుక్రవారం కేసీఆర్‌ నిర్వహించే ఆశీర్వాద సభకు రావాలని బొట్టుపెట్టి ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎస్సారెస్పీ కాలువల్లో నీరు లేక సేద్యపు భూముల్లో తుమ్మలు మొలిచాయన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంట్, సాగునీటికి ప్రాజెక్టులు కడుతున్నామన్నారు. ఎన్నో పథకాలతో ప్రజలను ఆదకున్నామని స్పష్టం చేశారు.

ఈనెల 7న హుస్నాబా ద్‌లో నిర్వహించే తొలి ఆశీర్వాద సభకు మండలం నుంచి 10 వేల మంది తరలి రావాలని కోరారు. సమావేశంంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, నాయకులు పేరాల గోపాల్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య, జెడ్పీటీసీ బిల్లా వెంకటరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మునిగంటి స్వామి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ రావుల రవీందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పోలు ప్రవీణ్, రాయిశెట్టి చంద్రయ్య, ముత్యాల వీరారెడ్డి, కనుకుంట్ల విజయ్‌కుమార్, తాటిపల్లి యుగెందర్‌రెడ్డి, పోలిరెడ్డి హరీశ్, పైడిమల్ల తిరుపతిగౌడ్, పైడిపల్లి రవీందర్, బొమ్మగాని రాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top