పాలమూరును పరుగులెత్తిస్తాం | Sakshi
Sakshi News home page

పాలమూరును పరుగులెత్తిస్తాం

Published Mon, Dec 24 2018 10:36 AM

TRS MPs Talk On Palamuru Project - Sakshi

కొత్తూరు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పరుగులెత్తించే దిశగా సీఎం కేసీఆర్‌ కార్యాచరణ ప్రారంభించినట్లు ఎంపీలు జితేందర్‌రెడ్డి, బండ ప్రకాశ్‌ తెలిపారు. కొత్తూరు మండలంలోని జేపీ దర్గాలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రార్థనలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి బాబాకు చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోనే రెండోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఉద్యమనేతగా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ఇబ్బందులు, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసమే వివిధ రకాల పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు.
 
ఎత్తిపోతలపై ప్రత్యేక దృష్టి 
సీఎం కేసీఆర్‌ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీలు జితేందర్‌రెడ్డి, బండ ప్రకాశ్‌ తెలియజేశారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలు, నిధుల వ్యయం విషయంలో ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. సాధ్యమైనంత త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నట్లు వివరించారు. పవిత్రమైన జహంగీర్‌ పీర్‌ దర్గా అభివృద్ధికి తమ వంతు కృషి చేయనున్నట్లు ఎంపీలు పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ దర్గా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వక్ఫ్‌బోర్డు అధికారులు దర్గా అభివృద్ధికి సంబంధించిన నివేదికలను, మ్యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. తుది మ్యాప్‌ అనంతరం సీఎం సూచన ప్రకారం దర్గాలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement