ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు: సంగీత | Sakshi
Sakshi News home page

ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు: సంగీత

Published Wed, Nov 22 2017 6:20 PM

TRS leader Srinivas reddy Second Wife Continues Protest - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించలేదని సంగీత స్పష్టం చేశారు. తన అత్తమామలను అరెస్ట్‌ చేసి, తనకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. తన పాపకు భరోసా కల్పించాలని, భార్యగా తనకు దక్కాల్సిన గౌరవం కావాలన్నారు. అత్తింటి వారిని తాను డబ్బులు డిమాండ్ చేయలేదని తెలిపారు. రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు. తన భర్త పులగండ్ల శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద వరుసగా నాలుగు రోజు ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. నిద్రాహారాలు మాని చంటిపిల్లతో కలిసి పోరాటం చేస్తున్నారు.

సంగీతను మల్కాజ్‌గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంగీతకు న్యాయం చేస్తామని, మరో మహిళకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని హామీయిచ్చారు. సంగీత అత్తమామలను అరెస్ట్‌ చేసి, శిక్ష పడేలా చేస్తామన్నారు. సంగీత, ఆమె బిడ్డను అన్నివిధాల ఆదుకుంటామని భరోసాయిచ్చారు. శ్రీనివాసరెడ్డి ఆస్తిలో వాటా ఇప్పించడమే కాకుండా, కొంత నగదు కూడా ఇప్పిస్తామన్నారు. అత్తమామలను అరెస్ట్‌ చేసే వరకు తాను దీక్ష విరమించబోనని సంగీత స్పష్టం చేయడంతో.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపై నిర్భయ కేసు నమోదు చేయాలంటూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

సంగీతకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం సంఘీభావం ప్రకటించారు. ఆమెకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఈ సందర్భంగా కోదండరాంకు ఆమె తెలిపారు. సంగీతకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement
Advertisement