మినీ గురుకుల సిబ్బందికి వేతన కష్టాలు

TRS Govt Has To Increase Wages Of Mini Gurukula Staff - Sakshi

రూ.5 వేలు దాటని ఉద్యోగుల నెలవారీ వేతనం

ఏళ్లుగా జీతాల పెంపు ఊసెత్తని ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని మినీ గురుకులాల్లో సిబ్బందికి వేతన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అత్తెసరు జీతాలే ఇస్తోంది. ఒక్కో ఉద్యోగికి నెలవారీ వేతనం రూ.5వేలకు మించడం లేదు. మెజార్టీ ఉద్యోగులకు నెలకు కేవలం రూ.2,500 చొప్పున ఇవ్వడం గమనార్హం. వీటిని పెంచాలని ఉద్యోగులు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

సాధారణంగా గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకుంటారు. కానీ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని మినీ గురుకులాలు ఏర్పాటు చేసింది. ఇందులో ప్రాథమిక స్థాయి నుంచే అడ్మిషన్లు తీసుకుని వసతితో కూడిన బోధన అందిస్తుంది. ఇలా గిరిజన సంక్షేమ శాఖ 29 మినీ గురుకులాలను తెరిచింది. వీటిలో వార్డెన్, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్‌ఎం, అకౌంటెంట్, కుక్, ఆయా, హెల్పర్, స్వీపర్, వాచ్‌మెన్‌ కేటగిరీల్లో 418 మందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించింది. 

ఏళ్లుగా అరకొర జీతాలే 
మినీ గురుకులాల్లో సిబ్బందికి ఏళ్లుగా అరకొర వేతనాలే ఇస్తున్నారు. వార్డెన్‌కు రూ.5 వేలు, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్‌ఎంలకు రూ.4 వేలు, అకౌంటెంట్‌కు రూ.3,500, కుక్, ఆయా, స్వీపర్, వాచ్‌మెన్‌లకు రూ.2,500 చొప్పున వేతనాలిస్తున్నారు. ఆరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ గురుకులాల్లో సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు పెంచలేదు. వేతన పెంపును కోరుతూ పలుమార్లు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేదు.

గిరిజన సంక్షేమ శాఖ వేతన పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించి ఏడాది కావస్తున్నా ఫైలుకు మోక్షం కలగలేదు. మరో పక్షం రోజుల్లో 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆలోపు వేతనాలు పెంచాలని మినీ గురుకులాల సిబ్బంది అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గడువులోగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకుంటే విధులు బహిష్కరించి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top