లక్షన్నర ఎకరాలకు నీళ్లిస్తం

TRS Give One Lakh Acres Irrigation  Water In Telangana - Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని సీఎస్‌ఐ గ్రౌం డ్స్‌లో సోమవారం టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్ర చార సభ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌ అధ్యక్షతన జరిగి న సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాకూటమిని ఎండగట్టారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూనే తిరిగి అధికారం అప్పగిస్తే చేపట్టే కార్యక్రమాలను వివరించారు.  

కామారెడ్డిలో గంప గోవర్ధన్‌ ఎమ్మెల్యేగా గెలవడం, తాను సీఎం కావడం వల్లే జిల్లా చేసుకున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. జిల్లాను చేయడమేగాక కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నామన్నారు. కామారెడ్డికి మెడికల్‌ కాలేజీ కూడా వస్తదన్నారు. సౌత్‌ క్యాంపస్‌ గురించి మాట్లాడుతూ అక్కడి కోర్సులను తిరిగి తీసుకువచ్చి పూర్వవైభవం తీసుకువస్తమన్నారు. కామారెడ్డికి జాతీ య రహదారి ఉన్నదని, రైల్వేలైను ఉందని, దీనికి జిల్లా కేంద్రం కావడంతో అభివృద్ధిలో ముందుకు వెళుతుందన్నారు. కాళేశ్వరం నీళ్లొస్తే ఇక్కడి రైతులు మంచి పంటలు పండిస్తరని, రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలనే కల నెరవేరుతుందని పేర్కొన్నారు. చిన్నప్పుడు కామారెడ్డికి వస్తే బెల్లం వాసన వచ్చేదన్నారు. ఆ వాసన ఇప్పుడు మాయమైందని, ముందుముందు బెల్లం సమస్యను కూడా పరిష్కరించుకుందామని పేర్కొన్నారు.  

వ్యవసాయానికి ప్రాధాన్యత.. 

వ్యవసాయ రంగానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామన్నారు. పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.4 వేలు ఇస్తున్నామని, దాన్ని వచ్చే ఏడాది రూ.5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. రైతులు ఏకారణంగాతోనైనా చనిపోయినపుడు వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు రైతుబీమా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,400 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున అందించి ఆదుకున్నామన్నారు. బీడీ కార్మికులు ఎన్నో కష్టాలు పడుతుంటే యూనియన్లు యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మికులను పట్టించుకునేవి కావని కేసీఆర్‌ పేర్కొన్నారు. తాము బీడీ కార్మికుల విషయంలో ఆలోచించి వారికి రూ. వెయ్యిచొప్పున జీవనభృతి అందిస్తున్నామని, తిరిగి అధికారంలోకి రాగానే రూ.2 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్లు రూ.2 వేలకు, వికలాంగుల పింఛన్లు రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

 కేసీఆర్‌ కిట్‌తో.. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే కేసీఆర్‌ కిట్‌తో పాటు రూ. 12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తున్నామని టీఆర్‌ఎస్‌ అధినేత పేర్కొన్నారు. ఇంటింటికీ నీళ్లిచ్చేందుకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా నల్లా కనెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు.

మాటలకే పరిమితం.. 

షబ్బీర్‌అలీ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతడని, ఆయన కరెంటు మంత్రిగ ఉన్నపుడు 24 గంటల పాటు రైతులకు కరెంటు ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్‌ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 24 గంటల పాటు రైతులకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నామని, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోయే పరిస్థితులు లేనేలేవని పేర్కొన్నారు. విద్యుత్‌ తలసరి సగటు వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేంద్ర విద్యుత్‌సాదికార సంస్థ పేర్కొన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

వెనుకబడిన తరగతులకు చెందిన గంప గోవర్ధన్‌ ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశాడని, ఆయనను లక్ష మెజారిటీతో గెలిపించి లక్షన్నర ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు తెచ్చుకోవాలని కోరారు. సభలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మ, నాయకులు సుభాష్‌రెడ్డి, బక్కి వెంకటయ్య, ముజీబొద్దీన్, డాక్టర్‌ అయాచితం శ్రీధర్, నిట్టు వేణుగోపాల్‌రావు, ఎల్‌.నర్సింగ్‌రావు, సత్యంరావు, మధుసూధన్‌రావు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top