ఆపరేషన్ ఆకర్ష్ | TRS focus on MPTS,ZPTS Positions | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ ఆకర్ష్

Jun 23 2014 1:30 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఆపరేషన్ ఆకర్ష్ - Sakshi

ఆపరేషన్ ఆకర్ష్

కాంగ్రెస్..టీడీపీ.. కమ్యూనిస్టు పార్టీలు ఏవైనా సరే... నేతలు, కేడర్ సుముఖంగా ఉన్నారా..? ఉంటే సరి.. ఆహ్వానించడమే తరువాయి. వారిని పార్టీలో చేర్చుకుని బలహీనతను అధిగమించే

సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్..టీడీపీ.. కమ్యూనిస్టు పార్టీలు ఏవైనా సరే... నేతలు, కేడర్  సుముఖంగా ఉన్నారా..? ఉంటే సరి.. ఆహ్వానించడమే తరువాయి. వారిని పార్టీలో చేర్చుకుని బలహీనతను అధిగమించే పనిలో పడింది టీఆర్‌ఎస్. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడంతోపాటు, ఒక ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని జిల్లాపై పట్టు పెంచింది. కానీ, ఇదంతా కేవలం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికే పరిమితమైంది. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలోని నియోజకవర్గాల్లో సరైన పట్టు చేజిక్కలేదు. దీంతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది.  నాగార్జునసాగర్ నియోజకవర్గానికి నోముల నర్సింహయ్య నకిరేకల్ నుంచి వలస వెళ్లడంతో అక్కడ నాయకత్వ కొరత తీరినట్టే కనిపిస్తున్నా, గ్రామస్థాయి నుంచి పార్టీని నిలబెట్టాల్సిన అవసరాన్ని గుర్తించింది.
 
 హుజూర్‌నగర్ నియోజకవర్గంలో తెలంగాణ
 అభిమానమున్నా, స్థానిక నాయకత్వం బలంగా లేదు. ఈ కారణంగానే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ మలి ఉద్యమ తొలిఅమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. ఆమె రెండో స్థానంలో నిలిచారు. కానీ, ఇక్కడ స్థానికంగా ఉండి రాజకీయం చేయలేని పరిస్థితి. దీంతో ఇక్కడ స్థానికంగా బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకునే వ్యూహంలో టీఆర్‌ఎస్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు గెలిచిన, ఓడిపోయిన  నియోజకవర్గాలు అన్న తేడా లేకుండా ఆయా పార్టీల నుంచి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సుముఖంగా ఉన్నారని తెలిసిన వెంటనే కండువాలు కప్పేస్తున్నారు. కాంగ్రెస్‌కు దీటుగా తయారుకావడం, టీడీపీ ఆనవాళ్లు లేకుండా చేయడం అనే ద్విముఖ వ్యూహంతో టీఆర్‌ఎస్ అడుగులు వేస్తున్నది.
 
 టీడీపీ... ఖాళీ
 ఆయా పార్టీల కంటే టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఎక్కువగా టీడీపీ నాయకులు, కేడరే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే నల్లగొండ నియోజకవర్గం నుంచి బోయపల్లి కృష్ణారెడ్డి వంటి సీనియర్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతోపాటు నల్లగొండ టౌన్‌లో పార్టీకి అండగా ఉన్న వారూ మారిపోయారు. నకిరేకల్ నియోజకవర్గంలో సైతం ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ కూడా టీడీపీకి చెందిన నాయకుడు రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి సైతం ఇప్పటికే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ముందే టీఆర్‌ఎస్‌లో చేరిన వేనేపల్లి వెంకటేశ్వరావు మిగిలిన టీడీపీ కేడర్‌నూ టీఆర్‌ఎస్ వైపు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల నల్లగొండలో టీఆర్‌ఎస్ జిల్లా ఇన్ చార్జ్ , రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సమక్షంలో భారీగానే చేరికలు జరిగాయి.
 
 నల్లగొండకు చెందిన కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి, మైనారిటీ నాయకులు సైతం టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. జిల్లావ్యాప్తంగా మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు, మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు, కోఆప్షన్ సభ్యుల పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆయా పదవుల్లో మెజారిటీగా సొంతం చేసుకునే వ్యూహం టీఆర్‌ఎస్‌ది. కాగా, వచ్చే  ఐదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పాలకపక్షంలో చేరిపోయి, రాజకీయ భవిష్యత్‌ను పునర్నిర్మించుకోవడం కోసం పలువురు నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఎదురుచూస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మొత్తానికి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తిస్థాయిలో బలోపేతం కావడంపై గులాబీ నేతలు బాగానే దృష్టి సారించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement