ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్‌కు అవకాశం | Tribunal Judgement On Power Employees Transfer | Sakshi
Sakshi News home page

ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్‌కు అవకాశం

Jul 17 2019 1:45 AM | Updated on Jul 17 2019 1:45 AM

Tribunal Judgement On Power Employees Transfer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై జస్టిస్‌ కేఎం ధర్మాధికారి కమిషన్‌ తీసుకునే నిర్ణయం సరైంది కాదని భావిస్తే అప్పీల్‌కు రావచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర కేడర్‌ విద్యుత్‌ ఉద్యోగుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు ఆప్షన్లు స్వీకరించి, వారి అభీష్టం మేరకే కేటాయింపులు జరపాలన్న ధర్మాధికారి కమిషన్‌ మార్గదర్శకాలపై స్పష్టత కోరుతూ తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఏపీ స్థానికత గల 1,157 మంది విద్యుత్‌ ఉద్యోగులను 2015 జూన్‌లో తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్‌ చేశాయి. అయితే రిలీవైన వారిని స్వీకరించడానికి ఏపీ విద్యుత్‌ సంస్థలు నిరాకరించడంతో ఈ వివాదం ప్రారంభమైంది.

దీంతో ఈ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు గతంలో రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏకసభ్య కమిషన్‌ నిర్ణయమే తుది నిర్ణయమని అప్పట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కమిషన్‌ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు తాజాగా సుప్రీంకోర్టు అనుమతించడంతో తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఊరట లభించింది. వివాదానికి కారణమైన 1,157 మంది ఉద్యోగులకే పరిమితం చేయకుండా, మొత్తం విద్యుత్‌ ఉద్యోగుల విభజనను మళ్లీ జరపాలని ధర్మాధికారి ఇటీవల మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కేడర్‌ విద్యుత్‌ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని రెండు రాష్ట్రాలను కోరారు. విద్యుత్‌ ఉద్యోగుల విభజనను రిలీవైన 1,157 మంది ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయాలా? అందరూ ఉద్యోగులకు వర్తింపజేయాలా? అన్న అంశంపై తెలంగాణ విద్యుత్‌ సంస్థలు స్పష్టత కోరుతూ పిటిషన్‌ వేయగా.. సుప్రీంకోర్టు పైవిధంగా తీర్పు వెల్లడించింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై ధర్మాధికారి కమిషన్‌ ఇంకా తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఆ లోగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండబోదని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement