మా మంచి పోలీసు | Tribal students Financial Helped to si | Sakshi
Sakshi News home page

మా మంచి పోలీసు

Feb 2 2015 11:49 PM | Updated on Oct 2 2018 5:51 PM

మా మంచి పోలీసు - Sakshi

మా మంచి పోలీసు

నిందితులను దండించడమే కాదు..అభాగ్యులకు అండగా కూడా నిలుస్తామని చాటాడో పోలీసు అధికారి.

మెదక్ రూరల్: నిందితులను దండించడమే కాదు..అభాగ్యులకు అండగా కూడా నిలుస్తామని చాటాడో పోలీసు అధికారి. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన నలుగురు గిరిజన విద్యార్థులను దత్తత తీసుకుని వారి చదువులు పూర్తయ్యే వరకు తానే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చి తన ఔదర్యాన్ని చాటడంతో పాటు నలుగురికీ ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెలితే... మెదక్ మండలం రాజిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మక్కపల్లి గిరిజన తండాకు చెందిన సంగీత, అనితలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులకు దూరమయ్యారు.

సంగీత రాజ్‌పల్లి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి పూర్తిచేసి గొర్రెల కాపరిగా మారగా, అనిత మెదక్ పట్టణంలోని బాలికల కళాశాలలో ఇంటర్  మొదటి సంవత్సరం పూర్తిచేసి గొర్రెలు కాస్తోంది. వీరికి చదువుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమయ్యారని, ఎవరైనా సాయం చేస్తే వీరి భవిత భరోసా దక్కుతుందని జనవరి 10న‘సాక్షి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. ‘మాకు చదువుకోవాలనుంది సారూ’ శీర్షికతో ప్రచురితమైన ఈ కథనాన్ని చదివిన మెదక్ రూరల్ ఎస్‌ఐ వినాయక్‌రెడ్డి గిరిజన బాలికలను చదివించాలని నిర్ణయించారు.

ఈ మేరకు 10 రోజుల క్రితం తండాకు వెళ్లి ఆరా తీసిన ఆయన, తండాలో మరో ఇద్దరు బాలికలు కూడా చదువుకు దూరమయ్యారని తెలుసుకున్నారు. ఆ సమయంలో బాలికలు లేకపోవడంతో సోమవారం ఉదయం మరోసారి తండాకు వెళ్లారు. గిరిజనులతో సమావేశమై చదువుకు దూరమైన సంగీత, అనితలతో పాటు ఇంటర్ తొలి సంవత్సరం పూర్తి చేసి ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన దివ్య, లక్ష్మిలను కూడా తాను దత్తత తీసుకుంటున్నానని, వారి చదువులు పూర్తయ్యే వరకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా అప్పటికప్పుడు చేగుంట కస్తుర్బాగాంధీ పాఠశాల ప్రిన్సిపాల్‌తో ఫోన్‌లో మాట్లాడి సంగీతను చేర్చుకోవాలని కోరారు. అప్పటికప్పుడు సంగీతకు రూ.1000 ఇచ్చి చేగుంటవెళ్లి పాఠశాలలో చేరాలని సూచించారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంతో చదువులు మానేసిన అనిత, దివ్య, లక్ష్మిలకు ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించి కళాశాలలో చేర్పిస్తానని తెలిపారు. అంతేకాకుండా వారికి బుక్స్, బస్‌పాస్‌లతో పాటు వారికి చదువుకు అయ్యేపూర్తి ఖర్చును తానే భరిస్తానని హామీఇచ్చారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం తండా వాసులతో ఎస్‌ఐ వినాయక్‌రెడ్డి మాట్లాడుతూ. బడీడు పిల్లలను తప్పకుండా చదివించాలన్నారు. ఆడపిల్లలు చదువుకుంటే ఆ కుటుంబానికే మేలు జరుగుతుందన్నారు. అంతేకాకుండా అన్ని సంక్షేమ పథకాలు అందుకోగలుగుతారన్నారు. ఎస్‌ఐ వెంట  టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు నాగరాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement