
పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శిస్తున్న బొత్స
శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపాటు
చికిత్స పూర్తి కాకుండానే పిల్లలను ఎందుకు ఇళ్లకు పంపిస్తున్నారని ప్రశ్న
మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున సాయం అందజేత
ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కురుపాంలో గిరిజన విద్యార్థులు మరణించారని, 200 మంది వరకు పిల్లలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకుడు, శాసన మండలిలో విపక్ష నేత, బొత్స సత్యనారాయణ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఆశ్రమ పాఠశాలలో పచ్చకామెర్ల కారణంగా మరణించిన తోయక కల్పన, అంజలి కుటుంబ సభ్యులను ఆయనతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు శుక్రవారం పరామర్శించి, ధైర్యం చెప్పారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన మేరకు పార్టీ తరఫున రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆరి్థక సాయం అందించారు. అనంతరం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, వైద్య శాఖ సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధిత పిల్లలను మానవత్వంతో వైఎస్ జగన్ పరామర్శించడాన్ని కూడా ఈ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు గానీ, మంత్రులు గానీ ఈ ఘటనపై సమీక్షించిన దాఖలాలు లేవన్నారు. పది రోజుల తర్వాత ఆ శాఖ మంత్రి ఆస్పత్రికి వచ్చారని ధ్వజమెత్తారు. ఇటువంటి ప్రభుత్వం ఉండటం మన దురదృష్టమన్నారు.
ప్రజారోగ్యం కుదేలు
విద్యార్థులకు పూర్తిగా నయం కాకుండానే విశాఖ కేజీహెచ్ నుంచి జిల్లా ఆస్పత్రికి, ఇళ్లకు పంపిస్తున్నారని బొత్స మండిపడ్డారు. మృతి చెందిన పిల్లల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘పిల్లలను ఎందుకు ఆదుకోరు.. అప్పట్లో అబ్బ సొత్తు ఇస్తున్నారా.. అన్నారు కదా.. ఇప్పుడు నేను అడుగుతున్నా.. వారి అబ్బ సొత్తు ఏమైనా ఇవ్వాలా?’ అని సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో వైద్య కళాశాలలను తాకట్టు పెట్టి, దోపిడీకి తెర తీయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి, ప్రజారోగ్యాన్ని కుదేలు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్నదొర, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.