వరంగల్‌లో గిరిజన సైనిక్‌ స్కూల్‌

Tribal Sainik School in Warangal - Sakshi

వరంగల్‌ జిల్లా అశోక్‌నగర్‌లో ఏర్పాటుకు సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మక సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు కానుంది. సరికొత్త హంగులతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ గిరిజన సైనిక్‌ స్కూల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమశాఖ.. సైనిక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో గిరిజన సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం అశోక్‌నగర్‌లో 2018–19 విద్యా సంవత్సరం నుంచి సైనిక పాఠశాల ప్రారంభించనుంది. ఇప్పటికే ఇక్కడ గురుకుల పాఠశాల కొనసాగుతుండగా.. దీనిని అదనపు హంగులతో సైనిక పాఠశాలగా తీర్చిదిద్దనుంది. 

కోరుకొండ తరహాలో.. 
ఉమ్మడి రాష్ట్రంలో బాగా పేరొందిన సైనిక పాఠశాల కోరుకొండలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో సైనిక పాఠశాల లేదు. వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌లో సైనిక పాఠశాల ఏర్పాటుకు అనుమతి లభించినప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ఉన్న తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కరీంనగర్‌లో సైనిక పాఠశాల ఏర్పాటుకు ఉపక్రమించింది. ఈ క్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలకు త్వరితంగా స్పందన రావడంతో చర్యలు వేగవంతం చేసింది. అశోక్‌ నగర్‌లోని గిరిజన గురుకుల పాఠశాలకు దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో మైదానం ఉంది. ప్రస్తుతం ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 720 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న గురుకులానికి ఎలాంటి ఆటంకం కలగకుండా కొత్తగా సైనిక పాఠశాలను ప్రారంభిస్తారు.

తొలి ఏడాది 80 సీట్లతో..
మొదటి సంవత్సరం 80 సీట్లతో సైనిక పాఠశాలను ప్రారంభిస్తారు. ఐదో తరగతిలో 40, ఇంటర్‌ ఫస్టియర్‌లో 40 సీట్లు ఉంటాయి. ఈ సీట్ల భర్తీ రెండంచెలుగా జరుగుతుంది. మొదట రాత పరీక్ష.. తర్వాత దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ పాఠశాలలో సబ్జెక్టు టీచర్లతో పాటు నలుగురు మాజీ సైనికాధికారులను నియమిస్తారు. కల్నల్‌ స్థాయి సైనికాధికారితో పాటు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కేటగిరీ, స్పోర్ట్స్, మ్యూజిక్, బ్యాండ్‌ కేటగిరీల్లో సైనికాధికారులను నియమించేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. సైనిక పాఠశాలలో చేరే విద్యార్థులకు రోజువారీ మెనూతో పాటు స్పెషల్‌ డైట్‌ ఉంటుంది. ఇందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించనుంది. అదేవిధంగా ఆధునిక హంగులతో జిమ్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ ‘సాక్షి’తో చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top