బాప్‌రే చలాన్‌ నెం.136

Traffic Police Bike Seized Traffic Rules Breaking in Hyderabad - Sakshi

28 నెలల్లో 136 సార్లు ఉల్లంఘనలు  

చెల్లించాల్సిన మొత్తం రూ.31590

ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: మీరు బైక్‌పై తిరుగుతున్నారా.. ఎప్పుడన్నా హెల్మెట్‌ పెట్టుకోవడం మరిచిపోయారా..! ఎవరు చూస్తార్లే.. అని డ్రైవింగ్‌ చేస్తూ సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నారా..! అయితే, ఒక్కసారి ‘ఈ–చలాన్‌’ చెక్‌ చేసుకోండి. మీ వాహనంపై ఎన్ని చలాన్‌లు జారీ అయ్యాయో చూసుకోండి. లేదంటే నగరంలో ఏదో ఒకచోట పోలీసులు మీ బండిని స్వాధీనం చేసుకుంటారు. ఆపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేస్తారు. దాంతో మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిదే. పోలీసులు లేని ప్రాంతంలో హెల్మెట్‌ లేకుండా తిరిగినా.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేసినా సీసీ కెమెరాల్లో గుర్తించి మరీ చలాన్‌లు జారీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి గురువారం ట్రాఫిక్‌ పోలీసుల కంటబడింది. హెల్మెట్‌ లేకుండా వాహనం నడుతున్న ఓ వ్యక్తిని ఆపితే ఏకంగా 136 ఈ చలాన్‌లు ఉన్నట్టు తేలింది. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడ ట్రాఫిక్‌ పోలీసులు గురువారం సాయంత్రం హిమాయత్‌నగర్‌ ‘వై జంక్షన్‌’ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

అదే సమయంలో అటుగా హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వచ్చిన వ్యక్తిని ఆపారు. ఈ ఉల్లంఘనపై చలాన్‌ జారీ చేస్తూనే.. సదరు బైక్‌పై ఉన్న పెండింగ్‌ చలాన్లు తెలుసుకోవడానికి ‘పీడీఏ మిషన్‌’లో బండి నెంబర్‌ (టీఎస్‌10ఈడీ9176) నమోదు చేశారు. మిషన్‌ నుంచి వచ్చిన ప్రింట్‌ ఔట్‌ చూసి పోలీసులకే కళ్లు తిరిగాయి. ఆ ద్విచక్ర వాహనంపై 28 నెలల్లో 136 సార్లు జారీ అయిన ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. చెల్లించాల్సిన పెనాల్టీ మొత్తం రూ.31,590కి చేరినట్లు అందులో ఉంది. వీటిలో జరిమానాల మొత్తం రూ.26,900 కాగా.. సర్వీస్‌ చార్జి మరో రూ.4690 ఉంది. ఆ ద్విచక్ర వాహనం కేకే ప్రకాష్‌ పేరుపై రిజిస్ట్రర్‌ అయింది. 2016 జూన్‌ 9న తొలిసారిగా హెల్మెట్‌ లేకుండా సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ.. డ్రైవింగ్‌ చేయడంతో రూ.1100 చలాన్‌ జారీ చేశారు. అప్పటి నుంచి గురువారం వరకు మొత్తం 136 ఈ–చలాన్లు జారీ అయ్యాయి.

వీటిలో కేవలం ఆరు మాత్రం సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌కు సంబంధించినవి కాగా.. మిగతా 127 హెల్మెట్‌ లేకుండా వాహనం నడపడం వల్ల జారీ చేసినవి. మిగిలినవి నో పార్కింగ్‌ ఏరియాలో వాహనం నిలిపిన ఉల్లంఘనకు సంబంధించినవి. ఈ పెండింగ్‌ చలాన్లలో కేవలం ఒక్కటి మాత్రమే సైబరాబాద్‌ పోలీసులు జారీ చేయగా మిగిలినవన్నీ సిటీకి సంబంధించినవే. క్యాష్‌లెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసులు ఉల్లంఘనుల నుంచి స్పాట్‌లో జరిమానా వసూలు చేయట్లేదు. కేవలం ఈ–చలాన్‌ మాత్రమే జారీ చేస్తూ ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, ఆన్‌లైన్‌లో వీటిని చెల్లించే వెసులుబాటు కల్పించారు. అయితే, ఈ వాహన చోదకుడు హెల్మెట్‌నే కాదు.. ఈ–చలాన్ల చెల్లింపునూ మర్చిపోవడంతో పెండింగ్‌ జాబితా చాంతాడంత అయింది. ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ముందు అతగాడికి ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కౌన్సిలింగ్‌ సైతం ఇవ్వనున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top