‘టోల్‌’ పెరిగింది!

Toll Gate Prices Hiked On National Highways - Sakshi

షాద్‌నగర్‌ టౌన్‌ : జాతీయ రహదారిపై ప్రయాణం మరింత భారంగా మారనుంది. టోల్‌ ప్లాజా.. ప్రయాణికుల తోలు తీస్తోంది. రుసుం పెంచి వారి జేబులు ఖాళీ చేస్తోంది. 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్‌ సమీపంలో ఉన్న రాయికల్‌ టోల్‌ ప్లాజాలో టోల్‌ ధరలు పెంచేశారు. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.  

ప్రయాణం మరింత భారం
సువిశాలంగా నిర్మించిన రోడ్డుపై రయ్‌.. రయ్‌ అంటూ వాహనదారులు దూసుకుపోతున్నారు. అయితే, వారి ప్రయాణం మరింత భారమైంది. 44వ జాతీయ రహదారిపై కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వరకు ఉన్న సుమారు 58 కిలోమీటర్ల మేర సుమారు రూ. 600 కోట్ల వ్యయంతో రోడ్డును విస్తరించి అవసరమైన చోట్ల బైపాస్‌ నిర్మించారు. 2009లో అప్పటి కేంద్ర మంత్రి ఈ రోడ్డును ప్రారంభించారు. షాద్‌నగర్‌ సమీపంలోని రాయికల్‌ గ్రామ శివారులో టోల్‌ ప్లాజాను ఏర్పాటు చేసి రుసుంను వసూలు చేస్తున్నారు. ప్రతి ఏడాది టోల్‌ రుసుం పెరుగుతూ వస్తోంది. అయితే, తాజాగా పెరిగిన టోల్‌ ధరలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. పెరిగిన టోల్‌తో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

పెరిగిన ధరలు ఇవీ..   
ప్రతి ఏడాది టోల్‌ గేట్‌ నిర్వాహకులు రుసుమును పెంచుతూనే ఉన్నారు. కారు, జీపువ్యానుకు ఒకసారి ప్రయాణానికి రూ.65, ఒకరోజులో బహుళ ప్రయాణానికి రూ.95, లైట్‌ కమర్షియల్‌ (ఎల్‌సీవీ) వాహనానికి రూ.110, రానుపోను ప్రయాణానికి రూ.165, ట్రక్కు, బస్సులకు(2 యాక్సిల్స్‌) ఒకసారి ప్రయాణానికి రూ.220, బహుళ  ప్రయాణానికి రూ.330, మల్టీ యాక్సిల్‌ వాహనం(2 యాక్సిల్‌) ఒకసారి ప్రయాణానికి రూ.355, బహుళ ప్రయాణానికి రూ.535, స్కూల్‌ బస్సుకు నెలవారీగా వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా కారు, జీపు వ్యానులకు నెలవారీ పాసు రూ. 1,895, లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు రూ.3,315, ట్రక్కు, బస్సులకు రూ.6625, మల్టీ యాక్సిల్‌ వాహనాలకు రూ.10,650 వసూలు చేస్తారు. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నట్లు టోల్‌ ప్లాజా నిర్వాహకులు తెలిపారు. గతంలో కంటే అన్ని వాహనాలకు రూ. 5 నుంచి 15 రూపాయల వరకు ధరలను పెంచారు. అంటే.. సుమారు 2.5 శాతం రుసుం పెరిగింది.   

ప్రస్తుతం వసూలు ఇలా..   
కారు, జీపు, వ్యాన్లకు ఒకసారి ప్రయాణానికి రూ.60, బహుళ ప్రయాణానికి రూ.90, లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు ఒకసారి ప్రయాణానికి రూ.110, బహుళ ప్రయాణానికి 160, ట్రక్కు, బస్సులకు ఒకసారి ప్రయాణానికి రూ.215, బహుళ ప్రయాణానికి రూ.325, మల్టి యాక్సిల్‌ వాహనం ఒకసారి ప్రయాణానికి రూ.345, బహుళ ప్రయాణానికి రూ.520లు ప్రస్తుతం వసూలు చేశారు.

లక్షల్లో టోల్‌ రుసుం వసూలు
షాద్‌నగర్‌ సమీపంలో ఉన్న రాయికల్‌ టోల్‌ ప్లాజా మీదుగా నిత్యం సుమారు ఐదువేల వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. వాహనదారుల నుంచి ప్రతిరోజు సుమారు రూ. 15 లక్షల వరకు రుసుం వసూలు అవుతోంది. చార్జీలు పెంచడం వలన ప్రతిరోజు మరో రూ.50 వేల వరకు అదనంగా రానుంది. గత ఏడాది ఈ టోల్‌ ప్లాజాలో వసూలు చేసే రుసుమును తగ్గించినా ఈసారి మాత్రం పెంచారు.  

వాహనాలను అమ్ముకుంటున్నాం
ఏటేటా టోల్‌ రుసుం పెంచుతూ పోతున్నారు. ధరలను పెంచడం వలన లారీల నిర్వాహకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వాహనాలను నడిపించడం భారంగా మారింది. దీంతో వాహనాలను అమ్ముకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే టోల్‌గేట్‌లను ఎత్తివేయాలి.           
– సయ్యద్‌ సాధిక్, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, షాద్‌నగర్‌

సామాన్యుల నడ్డి విరుగుతోంది  
ప్రతి ఏడాది టోల్‌ రుసుమును పెంచుతూ సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్నారు. టోల్‌ ధరలు పెంచడంతో బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో సామాన్యులపై భారం పడుతోంది. ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్ధితి నెలకొంది. టోల్‌ చార్జీల రూపంలో ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూలు చేయడం సరికాదు  
–  నర్సింహ్మ, షాద్‌నగర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top