అప్పటిదాకా సందడిగా ఉన్న పెళ్లి ఇళ్లు చివరి క్షణంలో కళ తప్పాయి...పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోయాయి.. ఒక చోట వరుడు నచ్చలేదని వధువు మొండికేయగా..మరోచోట పెళ్లి ఇష్టం లేదని వరుడు మొహం చాటేశాడు.
అప్పటిదాకా సందడిగా ఉన్న పెళ్లి ఇళ్లు చివరి క్షణంలో కళ తప్పాయి...పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోయాయి.. ఒక చోట వరుడు నచ్చలేదని వధువు మొండికేయగా..మరోచోట పెళ్లి ఇష్టం లేదని వరుడు మొహం చాటేశాడు... ఇంకోచోట పెళ్లి కూతురు నచ్చలేదని పెళ్లి కొడుకు పరారయ్యాడు...
జీలకర్ర, బెల్లం పెట్టాక పెళ్లి వద్దన్న వరుడు
వరుడికి దేహశుద్ధి చేసిన వధువు బంధువులు
వేదమంత్రాల నడుమ పచ్చని పందిట్లో జరుగుతున్న పెళ్లి హఠాత్తుగా ఆగిపోయింది. కొన్ని నిమిషాల్లో తాళి కట్టాల్సి ఉంది. అంతలోనే వరుడు తనకు పెళ్లి ఇష్టం లేదని మారాం చేశాడు. ఆగ్రహించిన అమ్మాయి తరఫు వారు వరుడిని, అతని బంధువులను చితకబాదారు. హన్మకొండకు చెందిన దొంతు రాంరెడ్డి కుమారుడు ప్రదీప్‌రెడ్డికి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి కుమార్తెతో బుధవారం హన్మకొండ ఎన్‌జీవోస్ కాలనీలో పెళ్లి జరుగుతోంది. వధువు తలపై వరుడు జీలకర్ర బెల్లం కూడా పెట్టాడు. తాళి కట్టే సమయంలో వాంతి వచ్చినట్లుగా ఉందని చెప్పిన వరుడు ఫంక్షన్ హాలు గదిలోకి వెళ్లి పెళ్లి ఇష్టం లేదంటూ తాళికట్టడానికి మొండికేశాడు. దీంతో వధువు బంధువులు ప్రదీప్‌రెడ్డిని, అతని సంబంధీకులను చితకబాదారు.
పోలీసులు ప్రదీప్‌రెడ్డితో పాటు అతనిపై దాడిచేసిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరుడి తల్లిదండ్రులు పారిపోయారు. వివాహం సవ్యంగా జరిగేందుకు వరుడుప్రదీప్‌కు సీఐ పృథ్వీధర్‌రావు కౌన్సెలింగ్ ఇచ్చారు. పెద్దల సమక్షంలో బుధవారం రాత్రి వరకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
పెళ్లికొడుకు నచ్చలేదని..
కాటారం, న్యూస్‌లైన్: వరుడు ఇష్టం లేదని పెళ్లి కూతురు చెప్పడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. కరీంనగర్ జిల్లా కాటారం మండలం చింతకానికి చెందిన రేవె ళ్లి అనూష, వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం కొండపల్లికి చెందిన శ్రీనివాస్‌కు బుధవారం వివాహం జరగాల్సి ఉంది. రెండు కుటుంబాల వారు వధువు ఇంట్లో పెళ్లి జరిపేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి మండపంలోకి రావాల్సిన సమయంలో తనకు పెళ్లి కొడుకు ఇష్టం లేదని, మేనమామ రాజునే పెళ్లి చేసుకుంటానని వధువు తెగేసి చెప్పింది. దీంతో కంగుతున్న రెండు కుటుంబాల సభ్యులు, రాజును విచారించగా తనకు అనూష అంటే ఇష్టం లేదని, ఆమెను తాను ఇష్టపడటం లేదని, కావాలనే అలా చెపుతుందని అన్నాడు. దీంతో చేసేదేమీలేక పెళ్లి తతంగం నిలిపివేసి కులపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు.
పరారైన పెళ్లి కొడుకు...
మరో యువకునితో పూర్తయిన పెళ్లి
అమ్మాయికి తెలివిలేదని పరారయ్యాడు ఓ పెళ్లి కుమారుడు. మరో యువకుడు ఆమెతో వివాహానికి ముందుకు రాగా పెళ్లి ఘనంగా జరిపించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లిలో బుధవారం జరిగింది. చౌటుప్పల్ మండలం జైకేసారంకు చెందిన నట్ట భిక్షంకు వర్కట్‌పల్లికి చెందిన సిర్పంటి నర్సింహ కూతురుతో బుధవారం వివాహం జరగాల్సి ఉంది. వరుడు, వధువు బావామరదళ్లు. ఉదయం 10.30 గంటలకు వివాహ ముహూర్తం. వరుడిని తీసుకెళ్లేందుకు తెల్లవారుజామున వధువు తరఫు బంధువులు వచ్చారు. ఇంతలోనే పెళ్లికుమారుడు భిక్షం బయటికి వెళ్లొస్తానంటూ బైక్ తీసుకుని వెళ్లాడు. గంట, రెండు గంటలైనా రాలేదు. దీంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అక్కడా.. ఇక్కడా వెతికారు.
చివరకు రామన్నపేట సమీపంలో పెళ్లి కుమారుడు తీసుకెళ్లిన బైకు దొరికింది. కానీ, అతని జాడ మాత్రం లేదు. చివరకు పరారైనట్టు గుర్తించారు. వివాహం ఆగినంత పని జరిగింది. దీంతో ఇరువర్గాల పెద్దమనుషులు చర్చించారు. లింగోజిగూడానికి చెందిన వధువు మేనత్త శంకరమ్మ కుమారుడు రాజుతో వివాహం చేయాలని నిర్ణయించారు. ఆగిపోతుందనుకున్న వివాహం రాత్రి ఏడు గంటలకు ఆడంబరంగా నిర్వహించారు. పారిపోయిన పెళ్లికుమారుడి తల్లిదండ్రులు కూడా తమ ఆస్తినంతా రాజుకు ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, రాజు హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు.