
పాము చంపేస్తోంది!
అసలే వర్షకాలం. అడపాదడపా కురిసిన వర్షానికి పరిసరాలు చిత్తడిగా మారాయి. పచ్చిక పెరిగింది. వాతావరణం చల్లగా ఉండడంతో విషప్పురుగులు, సర్పాలకు సంచరించడానికి అనువైన వాతావరణం ఉంది.
నిజామాబాద్‌అర్బన్ : అసలే వర్షకాలం. అడపాదడపా కురిసిన వర్షానికి పరిసరాలు చిత్తడిగా మారాయి. పచ్చిక పెరిగింది. వాతావరణం చల్లగా ఉండడంతో విషప్పురుగులు, సర్పాలకు సంచరించడానికి అనువైన వాతావరణం ఉంది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్తున్నవారిని కాటేస్తున్నాయి. పరిసరాలు చిత్తడిగా ఉండడంతో ఇళ్లలోకీ వస్తున్నాయి. జూలై నెలలోనే జిల్లాలో ఆరుగురిని కాటేసి చంపాయి.
సోమవారం రాత్రి రెంజల్ మండల కేంద్రానికి చెందిన తండ్రి, కూతురు పాము కాటుకు గురై మరణించారు. ఇదే నెల తొమ్మిదో తేదీన జలాల్‌పూర్ గ్రామానికి చెందిన శివలక్ష్మి(5) పాము కాటుకు గురై మరణించిన విషయం తెలిసిందే. 12వ తేదీన లింగంపేట మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన సాయన్న(58) అనే మేకల కాపరి పాముకాటుకు గురై మరణించారు. 16వ తేదీన వర్ని మండలం రుద్రూర్ ప్రభుత్వ పాఠశాలలో సాకలి శ్రీను అనే విద్యార్థి పాము కాటుకు గురై మరణించిన విషయం విదితమే. 20న బిచ్కుంద మండలం చిన్నదడ్గి గ్రామానికి చెందిన లక్ష్మి(29)తెల్లవారుజామున ఇంటిలో వంట చేస్తుండగా పాముకాటుకు గురై చనిపోయారు.
అంతేకాకుండా ఈనెల 11వ తేదీన బోధన్‌లోని బాలికల సంక్షేమ వసతి గృహంలో, 26న బాల్కొండ మండలం రెంజర్ల ప్రాథమిక పాఠశాలలో పాము ప్రత్యేక్షమైన విషయం తెలిసిందే. విద్యార్థులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. మాక్లూర్ ఎస్సీ కాలనీకి చెందిన నీరడి సవిత, నిజామాబాద్ మండలం మోపాల్ ప్రభుత్వ వసతి గృహంలో ఉండే శివకుమార్, నిజామాబాద్ మండలం తిర్మన్‌పల్లి, మల్కాపూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు బాలురు సైతం పాము కాటుకు గురైనా సకాలంలో వైద్యం అందడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
అవగాహన లేక..
పాము కాటుకు గురైన వ్యక్తులు నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అయితే నాటు వైద్యం పనిచేయక పరిస్థితి విషమిస్తుండడంతో ఆస్పత్రులకు తీసుకువెళ్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించి పాము కాటుకు గురైనవారు మరణిస్తున్నారు. నవీపేట మండలంలో గంగారాం అనే నాటు వైద్యుడుండేవాడు. గత నెలలో పాము కరవడంతో నాటు వైద్యం చేసుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో మరణించాడు. పాము కాటు వేయగానే ఆస్పత్రులకు తీసుకెళ్తే ప్రాణాపాయం తప్పే అవకాశాలుంటాయి.
మందులు ఉన్నా..
జిల్లాలోని 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 సబ్‌సెంటర్లు, 3 ఏరియా ఆస్పత్రులున్నాయి. 119 మంది వైద్యులు ఆయా ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. రాత్రివేళలో వైద్యం అందించేందుకు 24 గంటల ఆస్పత్రులు 29 ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో ఆంటీ స్నేక్ వీనమ్ అందుబాటులో ఉంది. కానీ ఇవి పాము కాటుకు గురైనవారిని కాపాడలేకపోతున్నాయి.
పాముకాటు వేసిన వ్యక్తి ఆస్పత్రికి వెళ్తే సంబంధిత వైద్యుడు అందుబాటులో ఉండడం లేదు. ఆస్పత్రి సిబ్బంది పాము కాటుకు విరుగుడు మందు ఇవ్వడానికి జంకుతున్నారు. ఆంటీబయోటిక్, టీటీ ఇంజక్షన్లు ఇచ్చి సమీపంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. ఏరియా ఆస్పత్రికో జిల్లా కేంద్ర ఆస్పత్రికో తీసుకెళ్లేసరికి పరిస్థితి విషమించి మృత్యువాత పడుతున్నారు.
తక్షణమే వైద్యం అందేలా చూడాలి
పాముకాటుకు గురైన వ్యక్తికి తక్షణమే వైద్య స హాయం అందేలా చూడాలి. కరిచిన చోట స బ్బుతో శుభ్రంగా కడిగి ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. పాము కరిచిన 35 నిమిషాల్లో చికిత్స అందిస్తే ఫలితం ఉంటుంది. నాటు వైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.
-సురేశ్‌కుమార్, ఫిజీషియన్, నిజామాబాద్
రెంజల్‌లో తండ్రీకూతురు మృతి
రెంజల్ : పాము రూపంలో వచ్చిన మృత్యువు తండ్రితోపాటు కూతురు ను కూడా బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకేరోజు మృత్యువాత పడడంతో రెంజల్‌లో విషాదం అలుముకుంది.
రెంజల్‌కు చెందిన అన్నం గంగారాం (44) సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లా రు. రాత్రి అలసిపోయి ఇంటికి వచ్చి కుటుం బ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనంత రం భార్య లక్ష్మి, కూతురు సౌందర్య, చిన్న కుమారుడు వినోద్‌లతో కలిసి నిద్రపోయా రు. పెద్ద కుమారుడు యోగేశ్ స్థానిక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తుండడంతో ఇంట్లో లేడు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన పాము గంగారాం మెడపై కాటు వేసింది. నిద్ర మత్తులో ఉన్న ఆయన ఏదో పురుగు అనుకొని చేతిని విది ల్చాడు. అది పక్కనే పడుకున్న కూతురు సౌందర్య చెవిపై పడింది. ఆమె చెవిపై పాము కాటు వేసింది.
పాము విషం ప్రభావంతో గంగారాం మేల్కొని వాంతులు చేసుకున్నా డు. దీంతో కుటుంబ సభ్యులు మేల్కొని చుట్టూ గాలించారు. ఏదైనా పురుగు కాటు వేసి ఉంటుందని భావించి తిరిగి నిద్రకు ఉపక్రమిస్తున్న తరుణంలో కూతురు కూడా వాం తులు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగువారిని పిలిచారు. వారు వచ్చి ఇద్ద రూ పాము కాటు కు గురైనట్లు గుర్తిం చి నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
అప్పటికే నీటిని తాగిన గంగారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. నాటు వైద్యుడు వారిని పరీక్షించి ఆస్పత్రి కి తీసుకెళ్లాలని సూచించాడు. 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో సౌందర్య మరణించింది. జిల్లా ఆస్పత్రికి చేరుకున్న తర్వాత గంగారాం మృత్యువాతపడ్డారు. మృతురాలు సౌందర్య ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్దే తల్లికి చేదోడు గా ఉంటుంది. పాము ఒకే కుటుంబానికి చెం దిన ఇద్దరిని బలి తీసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.