కొండగట్టు బస్సు ప్రమాదం.. కారణాలు ఇవే!

These are The Reasons For kondagattu bus accident - Sakshi

సాక్షి, జగిత్యాల : కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 62కు చేరింది. ఈ ఘటనలో మరో 38 మంది కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు.

కారణాలు ఇవే..
కొండగట్టు ఘాట్‌రోడ్డు లోయలో పడిన ఆర్టీసీ బస్సును అధికారులు గురువారం వెలికితీశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసిన అధికారులు.. ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. ఆర్టీసీ బస్సు కండిషన్‌లో లేకపోవడం, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. 2007 మోడల్‌కు చెందిన ఆర్టీసీ బస్సు జీవితకాలంలో 12 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా.. ప్రమాదానికి గురైన బస్సు  మాత్రం 14 లక్షల 95 వేల 116 కిలో మీటర్లు తిరిగిందని గుర్తించారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత బస్సును స్క్రాప్ (తుక్కు) కింద భావించి పక్కకు పడేయాలని, కానీ, స్క్రాప్‌గా భావించే బస్సును జగిత్యాల- శనివారంపేట రూటులో ఆర్టీసీ అధికారులు నడపడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెగ్యులర్ బస్సు, రెగ్యులర్ డ్రైవర్ అయినప్పటికీ కాలం చెల్లిన వాహనం కావడం.. ఘాట్‌రోడ్డులో సరిగ్గా బ్రేక్‌ వేయడానికి వీలుపడకపోవడంతో ప్రమాదం జరిగిందని విచారణ అధికారులు భావిస్తున్నారు. విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. బస్సు ఫిట్‌నెస్ సరిగా లేకపోవడం, బ్రేక్ రాకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉండడం ఈ మహా విషాదానికి కారణమని వారు ప్రాథమికంగా తేల్చినట్టు తెలుస్తోంది.

పార్టీ పరంగానూ సహాయం అందజేస్తాం
కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న 36మందిని మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ గురువారం పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వపరంగా రూ. ఐదు లక్షలు, ఆర్టీసీ పరంగా రూ. 3 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని మంత్రి ఈటల తెలిపారు. గాయపడ్డవారికి రెండున్నర లక్షల చొప్పున సహాయం అందిస్తామన్నారు. వారు పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వపరంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో తొమ్మిది మందికి రైతు బంధు జీవిత భీమా వర్తిస్తుందని, ఇక, పార్టీ సభ్యత్వం ఉన్న వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. రైతుబంధు, పార్టీ సభ్యత్వం వర్తించని వారికి టీఆర్‌ఎస్‌ పార్టీపరంగా ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top