ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్పందన లేదు 

There is Nothing of Federal Front: Jithenderreddy - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి 

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: దేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్పందనలేకనే 16 స్థానాలతో చక్రం తిప్పుతానని సీఎం కేసీఆర్‌ జిమ్మిక్కులు చేస్తున్నారని మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నివాసంలో ఆయన మాట్లాడారు. దేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలను కలిసిన కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్పందన కరువవడంతో 16 స్థానాలు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతానని మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని, 300 స్థానాలు బీజేపీ, మిత్రపక్షాలు 50 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.

మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ కేసిఆర్‌ విధానాల వల్ల తెలంగాణ అప్పుల పాలైందని, గతంలో ఎంపీలు ఉన్నా ఏం చేయలేని కేసీఆర్‌ ఇప్పుడేదో చేస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎంపీగా తనను గెలిపిస్తే పాలమూరు కష్టాలు తీర్చేందుకు పనిచేస్తానన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని, దేశ భద్రత, సమగ్రతకు నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ నాయకులు నాగూరావు నామాజీ, పద్మజారెడ్డి, శ్రీవర్దన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top