జిల్లా పరిషత్‌కు ‘ఖజానా’ షాక్!


సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ యంత్రాంగానికి ఖజానాశాఖ షాకిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు చేసిన ఎన్నికల నిధులను విడుదల చేయలేమని తేల్చి చెప్పింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం పాత బిల్లుల మంజూరు కుదరదని తెగేసి చెప్పింది. దీంతో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు వెచ్చించిన నిధులను సమకూర్చుకునేందుకు.. నిబంధనలకు విరుద్ధంగా మండల పరిషత్‌లలోని సాధారణ నిధులను వాడుకుంటోంది. జిల్లావ్యాప్తంగా మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4.30 కోట్లను కేటాయించింది. దీంట్లో సుమారు రూ.3.60 కోట్లు విడుదల చేసింది. అయితే, ఈ సొమ్మును మే నెలాఖరులోపు వినియోగించుకోవాలని నిర్దేశించింది.

 

జూన్ 2 అపాయింటెడ్ డే కావడంతో ఆ లోపే ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన పద్దులను తొలగించి.. జీరో పద్దులను తెరవాలని ప్రభుత్వం సూచించింది. మే రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ జిల్లా పరిషత్ అధికారులు బిల్లుల సమర్పణలో జాప్యం చేశారు. ఈ క్రమంలోనే జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఇతర జిల్లాల నుంచి వ చ్చిన ఎంపీడీఓలు.. అదే నెల 24న సొంత జిల్లాలకు తిరిగి వెళ్లిపోయారు.  దీంతో ఎన్నికల నిర్వహణా వ్యయానికి సంబంధించిన బిల్లులు/క్లెయిమ్‌లు ట్రెజరీలకు చేరడంలో ఆలస్యమైంది. కొత్త ఎంపీడీఓలు బాధ్యతలు స్వీకరించిన అనంతరం 30వ తేదీన బిల్లులు ప్రతిపాదించినప్పటికీ, వాటిని  ఖజానాశాఖ అనుమతించలేదు.

 

జూన్ 2న రాష్ట్రం లాంఛనంగా విడిపోవడంతో ఉమ్మడి రాష్ర్టంలో ఖర్చుచేసిన బిల్లులు మంజూరు చేసేదిలేదని ట్రెజరీ శాఖ కొర్రీ పెట్టింది. ఈ పేచీ తో ఎన్నికలకు వ్యయం చేసిన సుమారు రూ.60 లక్షల నిధుల విడుదల నిలిచిపోయింది. ఎన్నికల నిధుల విడుదలకు రాష్ట్ర విభజన ఆంక్షలు వర్తించవని తొలుత ఖ జానా శాఖ చెప్పడంతోనే బిల్లుల సమర్పణలో జాప్యం జరిగిందని, ఇప్పుడు ఆ శాఖ మాటమార్చడం దారుణమని అంటోంది.



ఎన్నికల నిర్వహణలో వినియోగించుకున్న సేవలకుగానూ చెల్లించాల్సిన నిధులను మండల పరిషత్‌లలోని జనరల్‌ఫండ్స్‌తో సర్దుబాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆయా మండలాల్లో అత్యవసర పనుల నిర్వహణకు నిధులు అందుబాటులో లేకుండా పోయాయని జిల్లా పరిషత్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణకు నిర్ధేశించిన నిధులపై ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించడం సరికాదని, ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top