వలస ఓటర్లు ఓటేస్తారా?

There are Around 25 lakh Migrant Voters Across the State - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో

గత అసెంబ్లీ ఎన్నికల్లోవారి ఓటుతో పెరిగిన పోలింగ్‌

ఈమారు వారిని రప్పించేందుకు టీఆర్‌ఎస్‌ యత్నం

సాక్షి, హైదరాబాద్‌: గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిన వలస ఓటర్లు ఈ మారు ఎంతమేర ప్రభావం చూపుతారన్నది ప్రస్తు తం ప్రధానాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది వరకు పొరుగు రాష్ట్రాలు, పట్టణాల్లో ఉన్న వలస ఓటర్లు ఉన్నారు. వీరు సొంత గ్రామాలకు తరలివచ్చి ఏ మేరకు ఓటు వినియోగించుకుంటారన్నది కీలకం కానుంది. ప్రస్తుతం వలస ఓటర్లను పోలింగ్‌బూత్‌కు రప్పించేందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కొంత మేర చొరవ చూపగా, ఇతర పార్టీ లు వారిని పట్టించుకున్న దాఖలాల్లేవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన ఉత్సాహం ఈసారి వలస ఓటర్లలో కనిపించకపోవడంతో ఈ ప్రభావం గెలుపోటములపై ఏమాత్రం ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. 

అప్పుడైతే పోటెత్తారు.. ఇప్పుడేమిటో? 
డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ, తాజా పంచాయతీ ఎన్నికల్లో వలస ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటెత్తారు. ఆ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా మారడంతో వలస ఓటర్ల లెక్క లు తీసి వారికి సకల సౌకర్యాలు సమకూర్చి పార్టీలు పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చాయి. నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్, జుక్కల్, నారాయణఖేడ్, జహీరాబాద్, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, వికారాబాద్, కొల్లాపూర్, మెదక్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు పెద్ద సంఖ్యలో కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉండటంతో వారిని రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సు వసతి కల్పించి తీసుకొచ్చారు.

దీనికి తోడు హైదరాబాద్‌లో సెటిలైన ఓటర్లు తమ పల్లెలకు తరలి ఓటు వినియోగించుకున్నారు. మొత్తంగా 25 లక్షల మంది వలస ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం 85 నుంచి 94శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రస్తుతం పార్టీలు వలస ఓటర్లపై పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదు. ఒక్క అధికార పార్టీ మాత్రం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మెజార్టీ ఎంత ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. భారీ మెజార్టీ రావాలంటే అందుకు తగ్గట్టే పోలింగ్‌ శాతం పెరగాలని, వలస ఓటర్లపై దృష్టి పెట్టాలని అభ్యర్థులను ఆదేశించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top