కాకిలెక్కలతో ఇక్కట్లు..! | The reason for the failure of the authorities | Sakshi
Sakshi News home page

కాకిలెక్కలతో ఇక్కట్లు..!

Jun 15 2014 2:47 AM | Updated on Jun 4 2019 5:04 PM

కాకిలెక్కలతో ఇక్కట్లు..! - Sakshi

కాకిలెక్కలతో ఇక్కట్లు..!

ఈ ఏడాది రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడులపై సంబంధిత శాఖల అంచనాలు కాకి లెక్కలని తేలిపోయింది. అధికారులు రూపొందించిన పొంతనలేని అంచనాలతో ధాన్యం విక్రయించేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు.

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈ ఏడాది రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడులపై సంబంధిత శాఖల అంచనాలు కాకి లెక్కలని తేలిపోయింది. అధికారులు రూపొందించిన పొంతనలేని అంచనాలతో ధాన్యం విక్రయించేం దుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. దీనికితోడు ధాన్యం కొనుగోళ్లలోనూ అధికార యంత్రాంగం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ, ప్రణాళిక శాఖలు సంయుక్తంగా పంట దిగుబడుల అంచనాలు రూపొందిస్తాయి.
 
ఏటా వరి కోతల సీజన్‌లో క్రాప్ కటింగ్ ఎక్స్‌పర్‌మెంట్లు నిర్వహించి దిగుబడులు అంచనా వేస్తారు. ఆయా  మండలాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రణాళిక శాఖకు సంబంధించి గణాంక అధికారులు ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈసారి మార్కెట్‌కు వచ్చిన ధాన్యం.. అధికారులు రూపొందించిన అంచనాలను పరిశీలిస్తే ఈ ప్రక్రియ తూతూ మంత్రంగా సాగినట్లు స్పష్టమవుతోంది.
 
వాస్తవాలకు దూరంగా అంచనాలు..
ఈ ఏడాది రబీ కొనుగోలు సీజన్‌లో సుమారు 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, ప్రణాళిక శాఖల అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి కాస్త అటు.. ఇటుగా ఈ అంచనాలు ఉండాలి. కానీ.. మార్కెట్‌లోకి వచ్చిన ధాన్యం 1.20 లక్షల మెట్రిక్ టన్నులకు పైనే. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ఇప్పటి వరకు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

అంటే వాస్తవానికి.. అధికారుల అంచనాలకు ఏ స్థాయిలో వ్యత్యాసం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లా అధికార యంత్రాంగం ఈ అంచనాల మేరకే ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసింది. సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సరిపడా గన్నీ బ్యాగులు, హమాలీ, ధాన్యం రవాణాకు ఏర్పాట్లు చేసుకుంది. కానీ.. అంచనాలకు అందని స్థాయిలో ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
 
అన్నదాతల ఇక్కట్లు..
అధికారుల వైఫల్యం కారణంగా ఈ రబీ కొనుగోలు సీజన్‌లో అన్నదాతలు పడరాని పాట్లు పడ్డారు. కేంద్రాలకు తెచ్చిన ధాన్యం కాంటాలు కాక రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. అకాల వర్షాలతో కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారుల వైఫల్యాన్ని నిరసిస్తూ ఏకంగా రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి వచ్చింది.
 
ముగుస్తున్న కొనుగోళ్లు..
రబీ కొనుగోలు సీజన్ దాదాపు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 181 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికి 1.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో సుమారు 1.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టం మిల్లింగ్ నిమిత్తం రైస్ మిల్లులకు తరలించారు. ఇంకా సుమారు 1.49 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
 
ట్రాన్స్‌పోర్టు బిల్లుల చెల్లింపుల్లో చేతివాటం
కొనుగోలు కేంద్రాల నుంచి ైరె స్ మిల్లులకు తరలించిన లారీ యజమానులకు బిల్లుల చెల్లింపుల్లో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ధాన్యం రవాణాకు లారీల కొరత ఉండటంతో రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ అధికారులు రహదారులపై వెళ్లే లారీలను బలవంతంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రవాణాకు వినియోగించారు. అయితే.. ఈ లారీ యజమానులకు చెల్లించాల్సిన బిల్లులో సంబంధిత సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement