ప్రకృతి వైపరీత్యాలతో సాగుచేసిన పంటలు దెబ్బతినడం.. అప్పుల బాధ పెరిగిపోవడంతో నల్లగొండ, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
నెట్‌వర్క్ : ప్రకృతి వైపరీత్యాలతో సాగుచేసిన పంటలు దెబ్బతినడం.. అప్పుల బాధ పెరిగిపోవడంతో నల్లగొండ, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామానికి చెందిన ఉప్పల చినసైదులు(38) తనకున్న మూడెకరాల్లో పత్తి, వరిసాగు చేశాడు. గతంలోనే అప్పులుండగా, ఈసారి పెట్టుబడికి అప్పు చేశాడు. సాగు ఆశాజనకంగా లేకపోవడంతో బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన ముర్కుంజాల అశోక్ (30) రెండెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని పంట సాగు చేసేవాడు.
ఈ ఏడాది వర్షాలు పడకపోవడంతో కౌలు తీసుకున్న భూమి బీడుగా మారింది. చేసిన అప్పులు పెరిగిపోవడంతో ఏమి చేయాలో తోచక బుధవారం సాయంత్రం కౌలు భూమిలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన దొడ్డ విష్ణు (26) నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. నాలుగేళ్లుగా పత్తి సాగులో వరుస నష్టాల కారణంగా సుమారు రూ. 4 లక్షల వరకు అప్పులపాయ్యాయి. రుణదాతల వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో బుధవారం తన చేనుకు వెళ్లి పురుగు మందు తాగాడు. మొదటగా గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. వరంగల్ జిల్లా నర్మెట మండలం నర్సాపుర్ గ్రామానికి చెందిన పెద్ది మహేష్(29)కు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. గత ఏడాది పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు సక్రమంగా పండకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. దీనికితోడు కుటుంబ పోషణ కూడా భారమైంది. ఈ సీజన్‌లో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో గురువారం పురుగుల మందు తాగాడు. జనగామ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.