టెండర్ తెరవాలంటే ఢిల్లీ వెళ్లాలి! | the department of national roads in telangana, face new problem for tenders | Sakshi
Sakshi News home page

టెండర్ తెరవాలంటే ఢిల్లీ వెళ్లాలి!

Nov 26 2014 1:49 AM | Updated on Sep 2 2017 5:06 PM

టెండర్ తెరవాలంటే ఢిల్లీ వెళ్లాలి!

టెండర్ తెరవాలంటే ఢిల్లీ వెళ్లాలి!

అది ఖమ్మం జిల్లాలో రూ.175 కోట్ల విలువైన పనులతో చేపడుతున్న ప్రాజెక్టు. 221 జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి ప్రతి చిన్నా చితకా వ్యవహారానికి తెలంగాణ జాతీయ రహదారుల విభాగం అధికారులు ఢిల్లీకి పరుగులు పెట్టాల్సి వస్తోంది.

జాతీయ రహదారుల పనులపై కేంద్రం కొత్త నిర్ణయం
 రూ.25 కోట్లకు మించిన పనుల వ్యవహారమంతా అక్కడే
 ఓ దేశం నేత నిర్వాకంతో వచ్చిన చిక్కు
జాతీయ రహదారుల పనుల్లో తీవ్ర జాప్యం
 
 సాక్షి, హైదరాబాద్: అది ఖమ్మం జిల్లాలో రూ.175 కోట్ల విలువైన పనులతో చేపడుతున్న ప్రాజెక్టు. 221 జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి ప్రతి చిన్నా చితకా వ్యవహారానికి తెలంగాణ జాతీయ రహదారుల విభాగం అధికారులు ఢిల్లీకి పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే ఐదు దఫాలుగా తిరిగి వారు విసిగిపోయారు. టెండర్లు తెరవటం, వాటికి అనుమతులు... ఇలా రకరాలుగా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఢిల్లీ వెళ్లినా సంబంధిత అధికారుల్లో ఆరోజు ఏ ఒక్కరు గైర్హాజరైనా ఆ తంతు వాయిదా... మళ్లీ ఢిల్లీకి పరుగులు. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందనే సామెతకు అద్దం పట్టే వ్యవహారమిది.

 

జాతీయ రహదారుల పనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే విషయంలో అధికార వికేంద్రీకరణ కోసం రాష్ట్రాలు పట్టుబడుతున్న తరుణంలో దానికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. రూ.25 కోట్ల కంటే ఎక్కువ విలువైన పనులకు సంబంధించిన టెండర్ల వ్యవహారాలను కేంద్రం తన గుప్పెట్లోకి తీసుకుంది. పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్రాలకు అధికారాలు బదిలీ కావాలంటూ డిమాండ్ చేస్తున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జాతీయ రహదారుల పనులు నత్తనడకలా సాగే ప్రమాదం నెలకొంది.  
 
 విమాన ఖర్చులు, హోటల్ బిల్లులు తడిసి మోపెడు
 
 టెండర్ బిడ్ తెరవటం, ఎవాల్యుయేట్ చేయటం, ఫైనాన్షియల్ బిడ్ తెరవటం, ఆమోదం ఇవ్వటం, ఇతర సందేహాల నివృత్తి... ఇలా ఒక్కో పనికోసం రాష్ట్రంలోని జాతీయ రహదారుల విభాగానికి సంబంధించి నలుగురైదుగురు అధికారులు ఢిల్లీకి పరుగుపెట్టాల్సి వస్తోంది. సంబంధిత కార్యక్రమ సమయం దగ్గరపడ్డాక కబురు వస్తుండటంతో విమానంలో వెళ్లాల్సి వస్తోంది. ఆ ఖర్చులతోపాటు హోటల్ బిల్లులు... తడిసిమోపెడవుతున్నాయి. అక్కడి అధికారులకు ఏదైనా ముఖ్యమైన పని పడి ఇది కాస్తా వాయిదా పడితే అప్పటి వరకు ఢిల్లీలోనే మకాం వేయటమో, లేదా వచ్చి మళ్లీ వెళ్లటమో జరిగి ఖర్చు మరింత పెరుగుతోంది. ఇటీవల ఓ పని కోసం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన వేళ స్థానికంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికారులు వెళ్లలేకపోయారు. దీంతో ఆ పని కాస్తా వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు రమ్మంటారని ఢిల్లీ అధికారులను అడిగితే... ఇప్పుడే చెప్పలేమని, తమకూ పనులున్నందున ఆలస్యం అవుతుందని సమాధానమిచ్చారు. జాతీయ రహదారులకు సంబంధించిన పనుల్లో 90 శాతం రూ.25 కోట్లకు మించినవే ఉంటున్నందున ఢిల్లీ చక్కర్లు పెద్ద సమస్యగా మారింది.
 
 ముఖ్యమంత్రి దృష్టికి సమస్య
 
 ఈ సమస్యపై జాతీయ రహదారుల విభాగం అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో మొరపెట్టుకున్నారు. టెండర్ల వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఢిల్లీకి సంబంధించిన ఎస్‌ఈ స్థాయిలో రీజినల్ అధికారి ఒకరు ఇక్కడ ఉంటారని, అన్నీ ఆయన సమక్షంలోనే జరుగుతాయని వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజకీయ నేత చేసిన తప్పిదాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆ అధికారిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా నిబంధనలను మార్చడం ఇబ్బందిగా ఉందని, దీనివల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని వారు సీఎంతో చెప్పారు. దీనిపై జోక్యం చేసుకుని అధికారాల వికేంద్రీకరణ జరిగేలా చూడాలని కోరారు.
 
 ‘దేశం’ నేత నిర్వాకంతోనే...


 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ‘దేశం’ నేత నిర్వాకంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారికి సంబంధించిన ఓ పని టెండర్‌ను తన అనుచరుడికి కట్టబెట్టే ఉద్డేశంతో ఆ దేశం నేత వైరి కాంట్రాక్టర్‌కు చెందిన ఓ అర్హత పత్రాన్ని మాయం చేయించాడు. ఈ -ప్రొక్యూర్‌మెంట్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తులో ఆ పత్రం ఉన్నా... తర్వాత సీల్డ్ కవర్ ద్వారా అందించే సమయంలో అది కనిపించలేదు. ఢిల్లీకి సంబంధించిన అధికారి పర్యవేక్షణ ఉన్నా ఈ వ్యవహారం చోటుచేసుకోవటాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement