ఎస్‌బీఐలో మళ్లీ దొంగలు పడ్డారు | The bank robbers would come again | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐలో మళ్లీ దొంగలు పడ్డారు

Feb 3 2015 2:26 AM | Updated on Sep 2 2017 8:41 PM

ఎస్‌బీఐలో మళ్లీ దొంగలు పడ్డారు

ఎస్‌బీఐలో మళ్లీ దొంగలు పడ్డారు

మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన కమలాపురంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరోసారి ...

సీపీయూలు, ప్రింటర్లు, మానిటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు
డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నం
ఇది మూడో సంఘటన

 
కమలాపురం (మంగపేట) : మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన కమలాపురంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరోసారి దొంగలుపడ్డారు. డబ్బులు దోచుకోవడం వీలుకాకపోవడంతో సీపీయూలు, ప్రింటర్లు, మానిటర్లు ఎత్తుకెళ్లారు. ఆదివారం జరిగినట్లు భావిస్తున్న ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది.

 బ్యాంకు అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. శని వారం బ్యాంక్‌కు ఆఫ్ డేతోపాటు ఆదివారం సెలవు ఉండటంతో సోమవారం 9.30 నిమిషాలకు బ్యాంకుకు వచ్చిన సిబ్బంది తాళాలు తీసిచూడగా దొంగలు పడినట్లు గుర్తిం చారు. దీంతో బ్యాంక్ మేనేజర్ ఆకుల వరప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై ముస్కెం శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి విచారణ చేపట్టారు.

దోపిడీకి పాల్పడిందిలా..

బ్యాంకు వెనుక వైపు గల ద్వారానికి ఏర్పాటు చేసిన గేటు ఐరన్ గ్రిల్స్‌కు వేసి ఉన్న తాళాలను యాక్సాస్ బ్లేడుతో కోసి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. వెంటనే సీసీ కెమెరాల వైర్లను తొలగించి డబ్బులను దోచుకెళ్లేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో చేసేదిలేక బ్యాంకులోని సీపీయూలు, రెండు ప్రింటర్లు, రెండు మాని టర్లను ఎత్తుకెళ్లారు. బిల్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు బ్యాంకులో రూ.కోటికి పైగా ఉన్నాయనే సమాచారంతోనే ఆదివారం రాత్రి దొంగలు దోపిడీకి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతే గాక చోరీ చేసే ముందు దొంగలు సీసీ కెమెరాల వైర్లు తొలిగించే సమయంలో ఇద్దరు దొంగలు ముసుగులు ధరించి ఉన్నారని వారు సెల్‌ఫోన్ వినియోగించినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు సీసీ కెమెరాల్లోని పుటేజీ ఆధారంగా దొంగతనం జరిగిన సమయంలో మండలంలోని వివిధ సెల్‌టవర్ల నుంచి పనిచేసిన సెల్‌ఫోన్ నంబర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
 
ఇది మూడోసారి..

ఇదిలా ఉండగా 2003లో బ్యాంకు దోపిడీకి ప్రయత్నించి విఫలమైన దొంగలు కిరోసిన్ పోసి బ్యాంకును దగ్ధం చేసేందుకు యత్నించారు. తిరిగి 2013లో మరోసారి దొంగలు బ్యాంక్ పైకప్పు రేకులను తొలగించి స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. మరోసారి ఇదే బ్యాంకులో చోరీ జరగడంతో బ్యాంక్‌పై పూర్తి అవగాహన ఉన్నవారే ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పనిచేస్తున్న సిబ్బందిపై ఆరా తీస్తున్నారు. సాయంత్రం ములుగు డీఎస్పీ బానోతు రాజమహేంద్రనాయక్, ఏటూరునాగారం సీఐ కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు బ్యాంక్‌ను సందర్శించి పరిశీలించారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి త్వరలోనే కేసు ఛేదిస్తామని డీఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement