గాల్లో తేలినట్టుందే..!

గాల్లో తేలినట్టుందే..!


కొత్తగూడెం: ఏరోనాటికల్ విద్యార్థుల మదిలో మెదిలిన ఓ ఆలోచన కొత్త యంత్రం ఆవిష్కరణకు దారితీసింది. అంతర్జాతీయ స్థాయిలోనే మొదటిసారిగా హోవర్‌లాపింగ్ ప్రొఫెల్లర్ విధానం ద్వారా వారు హోవర్‌బైక్‌ను తయారుచేసి చరిత్ర సృష్టించారు. వీరి నూతన ఆవిష్కరణపై అంతర్జాతీయ జర్నల్స్‌లో సైతం కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌కు లీడర్‌గా ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన విద్యార్థి లోకేష్ వ్యవహరించడం విశేషం.



కొత్తగూడెంలోని బాబుక్యాంపులో నివాసం ఉంటూ సింగరేణిలో పనిచేస్తున్న బదావత్ శంకర్ కుమారుడు లోకేష్ బెంగుళూరులో ఏరోనాటికల్ విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఈ సందర్భంలోనే తోటి విద్యార్థులతో కలిసి కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలతో ‘హోవర్ బైక్’ (గాలిలో తేలియాడుతూ నడిచే వాహనం)ను రూపొందించాలని సంకల్పించాడు. అనుకున్నదే తడవుగా తాను చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.మధుసూదన్‌రెడ్డి సహకారంతో తోటి విద్యార్థులు చావా నవ్యశ్రీ (హైదరాబాద్), కార్తీక్ (కర్ణాటక), మొమెన్ సింగా (అస్సాం)తో కలిసి పని ప్రారంభించారు.



అయితే ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌తో ఎన్నో కొత్త ఆవిష్కరణలు వచ్చినప్పటికీ అందుకు భిన్నంగా ఏదైనా చేయాలని ఆలోచించి హోవర్‌లాపింగ్ ప్రొఫెల్లర్ విధానంతో హోవర్‌బైక్‌ను తయారు చేయాలని వారు తలంచారు. సుమారు ఆరు నెలలపాటు కష్టపడ్డ వీరు చివరగా విజయం సాధించారు. లోకేష్ టీం తయారుచేసిన ప్రాజెక్టులో బ్యాటరీ, సెన్సార్లు, 1400 ఆర్‌పీఎంతో తిరిగే నాలుగు మోటార్లు ఉపయోగించగా ఇది సుమారు 2 కేజీల వరకు బరువును పైకి ఎత్తగలుగుతుంది. ఇదే విధానంతో ఫ్యూచర్ ఫ్లయింగ్ బైక్స్‌ను తయారుచేస్తే సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. బైక్స్‌లో సెన్సార్లు ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని, పూర్తిగా బ్యాటరీతో నడిచే అవకాశం ఉన్నందున కాలుష్యరహితంగా ఉంటుందని చెప్పారు.



వీరు రూపొందించిన ప్రాజెక్టును ఇప్పటికే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్నోవేటివ్ రీసెర్చింగ్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఐజెఐఆర్‌ఎస్‌ఇటి), ఇంటర్నేషనల్ జర్నల్స్ ఆఫ్ ఎనర్జింగ్ టెక్నాలజీస్ అండ్ అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ (ఐజేఈటీఏఈ), గెలాక్సీ ఇంటర్నేషనల్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ జర్నల్ (జేఐఐడీఆర్‌జె)లో కథనాలు ప్రచురితమైనట్లు విద్యార్థులు తెలిపారు. తమ ప్రాజెక్టునకు ప్రోత్సాహం లభిస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు రూపొందించేందుకు ప్రయత్నిస్తామని హోవవర్‌బైక్ ప్రాజెక్ట్ టీం లీడర్ లోకేష్ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top