
సాక్షి, హైదరాబాద్: ఉత్తర కోస్తా, ఒడిశా, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల సోమవారం ఉదయం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో ఉన్న ఈ ఆవర్తనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా సాగి రాగల 24 గంటల్లో తీవ్రంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల వాతావరణ సూచనలను ఈ మేరకు వెల్లడించింది.
తెలంగాణలో..
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జైశంకర్ భూపాలపల్లి, వరంగల్, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం, మంగళవారం చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశమంది.
కోస్తా ఆంధ్రలో..
కోస్తా ఆంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం, మంగళవారం భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తా ఆంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు బుధవారం కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో..
రాయలసీమలో సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.