మెరుపు వేగం.. గెలుపు దాహం!

Telangana Young Man Champion in Bike Racing - Sakshi

బైక్‌ రేసింగ్‌లో సత్తా చాటుతున్న కార్తీక్‌

అంతర్జాతీయ స్థాయి పోటీల్లో జయకేతనం    

మూడు నేషనల్‌ చాంపియన్‌షిప్‌లూ కైవసం  

తెలంగాణకే వన్నె తెస్తున్న సిటీ కుర్రాడు  

ఆ కుర్రాడు బైక్‌ ఎక్కాడంటే వాయువేగంతో దూసుకుపోవాల్సిందే. ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే. చాంపియన్‌షిప్‌ కొట్టాల్సిందే. చిన్నవయసులోనే జాతీయ, అంతర్జాయతీ స్థాయిలో పోటీల్లో జయకేతనం ఎగరవేస్తూ తెలంగాణకే వన్నె తెస్తున్నాడు నగరానికి చెందిన కార్తీక్‌ మాతేటి. గల్లీలో ప్రారంభమైన అతని ప్రస్థానం అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకునే స్థాయికి చేరింది. 19 ఏళ్ల వయసులో మూడు నేషనల్‌ చాంపియన్‌షిప్‌లు, ఇంటర్నేషనల్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని వారెవ్వా అనిపించుకున్నాడు కార్తీక్‌.

హిమాయత్‌నగర్‌ :చింతల్‌కు చెందిన సతీష్‌కుమార్, విజయలక్ష్మి దంపతుల కుమారుడు కార్తీక్‌. ప్రస్తుతం సోమాజిగూడలోని రూట్స్‌ కాలేజీలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బైక్‌ రేసింగ్‌ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండటంతో రేసర్‌ కావాలనే కలలు కన్నాడు. అతను ఉండే గల్లీలో నిదానంగా హోండా యూనికార్న్‌తో బైక్‌ నడపడం నేర్చుకున్నాడు. ప్రొఫెషనల్‌గా తయ్యారయ్యేందుకు మూడేళ్ల సమయం పట్టింది. గల్లీలో ప్రారంభమైన తన ప్రస్థానం ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ బైక్‌ రేసింగ్‌లో భారత్‌ తరఫున పాల్గొని చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు.

అంతర్జాతీయ రేసింగ్‌లో సత్తా..
గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీలో జరిగిన ‘ఏషియన్‌ కప్‌ ఆఫ్‌ రోడ్స్‌ రేజింగ్‌’ చాంపియన్‌షిప్‌ పోటీల్లో జపాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఫిలిప్పీన్, థాయ్‌లాండ్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున పాల్గొన్నారు. మన దేశం నుంచి అదీ తెలుగు రాష్ట్రాల నుంచి కార్తీక్, మిజోరం నుంచి కుల్‌స్వామిలుపాల్గొన్నారు. 5.5 కి.మీ రేసింగ్‌ ట్రాక్‌పై పోటీలు నిర్వహించగా.. కార్తీక్‌ విజయం సాధించాడు. దీంతో ‘ఏషియన్‌ కప్‌ ఆఫ్‌ రోడ్స్‌ రేసింగ్‌’ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని తెలుగోడి సత్తాను చాటాడు.  

మూడు నేషనల్స్‌లోనూ టాప్‌..
దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడు చాంపియషిప్‌లలో కార్తీక్‌ విజయ కేతనం ఎగరవేశాడు. గత ఏడాది ఫిబ్రవరిలో చెన్నైలో ‘ఎండ్యురెన్స్‌’ చాంపియన్‌షిప్‌లో 3.7 కి.మీ ట్రాక్‌పై 19 నిమిషాల పాటు ఏకధాటిగా రేసింగ్‌ చేసి టైటిల్‌ సాధించాడు. టీవీఎస్‌ వన్‌ మేక్‌ 150–సీసీ చాంపియన్‌షిప్‌ని, యమహా– ఆర్‌15 చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌ నగరంలో నిర్వహించిన పల్సర్‌ కప్‌లో వరసగా రెండేళ్లు రుయ్‌మంటూ మనోడే టాప్‌లో నిలిచాడు.  

స్ఫూర్తి వలంటీనో..  
నాకు ఇటాలియన్‌ బైకర్‌ వలంటీనో అంటే చాలా ఇష్టం. అతని వీడియోస్‌ చూసి ఇన్‌స్పైర్‌ అయ్యాను. అతి పిన్న వయసులో మూడు నేషనల్‌ చాంపియన్‌షిప్‌లతో పాటు ఒక ఇంటర్నేషనల్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నా. భవిష్యత్‌లో జరిగే ప్రతి ఇంటర్నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొని తెలంగాణ సత్తా చాటుతా.            – కార్తీక్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top