త్రీడీ సాంకేతికతతో యూఏవీ

Telangana T Works Tested New 3D UAV - Sakshi

పూర్థి స్థాయి త్రీడీ విడిభాగాలతో తయారీ

ప్రయోగాత్మకంగా పరీక్షించిన టీ వర్క్స్‌

సాక్షి, హైదరాబాద్‌: పూర్తిగా త్రీడీ సాంకేతికతతో తయారైన విడిభాగాలతో రూపొందించిన మానవ రహిత ఏరియల్‌ వెహికల్‌ (యూఏవీ)ను ‘టీ–వర్క్స్‌’పరీక్షించింది. గురువారం హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. యూఏవీ విడి భాగాలను పాలీ లాక్టిక్‌ యాసిడ్‌ (పీఎల్‌ఎ), అక్రిలోనైట్రిల్‌ బ్యూటాడిన్‌ స్టిరీన్, హై ఇంపాక్ట్‌ పాలిస్టైరీన్‌ (హెచ్‌ఐపీఎస్‌) పదార్థాలతో తయారుచేశారు. ఒకటిన్నర కిలోల బరువున్న ఈ యూఏవీని గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పయనించేలా రూపొందించారు.

గురువారం జరిగిన ప్రయోగ ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో త్రీడీ ముద్రిత యూఏవీల ఏరో డైనమిక్‌ ధర్మాలను విశ్లేషించనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మెకానికల్, మెకానికల్‌ రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్‌ సెంటర్‌గా పేరొందిన టీ వర్క్స్‌.. ఎయిరోస్పేస్‌ రంగంలో త్రీడీ ప్రింటింగ్‌ అప్లికేషన్ల సామర్థ్యం, పనితీరుపై వరుస పరిశోధనలు చేస్తోంది. ‘గతంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలను కలప, ప్లేవుడ్‌తో తయారు చేసేందుకు గతంలో నాలుగైదు వందల గంటలు పట్టేది. కానీ కంప్యూటర్‌లో విడి భాగాల డిజైనింగ్, త్రీడీ ప్రింటర్ల ద్వారా ప్రోటోటైప్‌ల తయారీ సులభతరమైంది’అని టీ–వర్క్స్‌ సుజయ్‌ కారంపూరి వివరించారు.

తక్కువ ఖర్చుతో తయారీ.. 
లిథియం పాలీమర్‌ బ్యాటరీ వినియోగంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సంక్లిష్టతతో తయారు చేసినట్లు సుజయ్‌ వెల్లడించారు. గురువారం పరీక్షించిన యూఏవీ డిజైన్, త్రీడీ విడి భాగాల ముద్రణకు 100 గంటల సమయం మాత్రమే పట్టిందని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న టీ–వర్క్స్‌ భవనం మరో 5 నెలల్లో పూర్తవుతుందని, అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో మొట్టమొదటి అత్యాధునిక ఏరోమోడలింగ్‌ వర్క్‌షాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. సొంతంగా యూఏవీల డిజైన్, నిర్మాణంపై ఆసక్తి ఉన్నవారు టీ–వర్క్స్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top