నీటి నిర్వహణ సూచీలో తెలంగాణ పైపైకి

Telangana State Improved Its Place In Composite Water Management Index - Sakshi

11 నుంచి 8వ స్థానానికి.. 

2 నుంచి 3వ స్థానానికి ఏపీ 

సాక్షి, న్యూఢిల్లీ : నీతి ఆయోగ్‌ రూపొందించిన నీటి నిర్వహణ సూచీ (కాంపొజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌)లో తెలంగాణ ప్రగతి కనబరచింది. 2015– 16లో 11వ ర్యాంకు సాధించిన రాష్ట్రం.. 2016– 17లో 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది. భూగర్భ జలాలను పెంచుకోవడం ద్వారా  ర్యాంకు ను మెరుగుపరుచుకున్నట్లు నీతి ఆయోగ్‌ విశ్లేషణలో వెల్లడైంది. 2015–16లో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌.. 2016–17లో 3వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. నీతి ఆయోగ్‌ తొలిసారి రూపొందించిన ఈ సూచీని 2015–16, 2016–17 సంవత్సరాలకు రూపొందించి 2015–16ను ప్రాతిపదికగా తీసుకున్నారు. 9 అంశాల ఆధారంగా ర్యాంకులను నిర్దేశించారు.

నీటి వనరులు, భూగర్భ జలాల పునరుద్ధరణ, భారీ, మధ్య తరహా నీటి పారుదల–నిర్వహణ, వాటర్‌షెడ్‌ అభివృద్ధి–నిర్వహణ, భాగస్వామ్య నీటి పద్ధతులు, సుస్థిర సాగునీటి నిర్వహణ పద్ధతులు, గ్రామీణ తాగునీరు, పట్టణ తాగునీరు–పారిశుధ్య నిర్వహణ, విధానాలు–పాలన ప్రాతిపదికన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు హిమాలయ, హిమాలయేతర కేటగిరీలుగా నీతి ఆయోగ్‌ ర్యాంకులు ప్రకటించింది. ఉపరితల నీటి వనరులను అభివృద్ధి పరుచుకొని సాగునీటి పారుదల సామర్థ్యం పెంచుకోవడం, విభిన్న రుతువుల్లో నీటి లభ్యత అంతరాలు తగ్గించడం అంశాల్లో తెలంగాణ ప్రతిభ కనబరిచినట్లు నీతి ఆయోగ్‌ పేర్కొంది. అయితే తెలంగాణలో 55% గ్రామీణ ఆవాసాలకే సురక్షిత తాగునీటి సరఫరా జరుగుతోందని, నీటి నాణ్యత మెరుగుపడటం లేదని నీతి ఆయోగ్‌ పేర్కొంది.

 ఏపీలో మూడో వంతు ఆవాసాలకు.. 
ఆంధ్రప్రదేశ్‌లో మూడో వంతు ఆవాసాలకు సురక్షిత తాగునీరు అందుబాటులో లేదని నీతి ఆయోగ్‌ విశ్లేíషించింది. 26% పట్టణ వ్యర్థ జలాలనే ఏపీ శుద్ధి చేస్తోందని, దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 50% పైగా పట్టణ కుటుంబాల నుంచి నీటి రుసుము వసూలు చేయడం లేదని పేర్కొంది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top