‘సోలార్’ తెలంగాణ

‘సోలార్’ తెలంగాణ - Sakshi


లోటు నుంచి మిగులు విద్యుత్ దిశగా రాష్ట్రం

‘సౌర’ వెలుగులతో కల సాకారం

రికార్డు స్థాయి ఉత్పత్తి లక్ష్యం

ఖరీఫ్‌లోగా 2747 మెగావాట్లు

రివర్స్ బిడ్డింగ్‌తో తగ్గిన ధరలు


సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించబోతోంది. లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఏర్పడబోతోంది.



సౌర విద్యుత్‌పై రాష్ట్రం అనుసరించే విధానం దేశం మొత్తానికి తలమానికం కాబోతోంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క ఏడాదిలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పి చరిత్ర సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇటీవల ప్రకటించిన ‘తెలంగాణ సౌర విద్యుత్ విధానం’ రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు మరింత ఊతమిస్తోంది. 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు గత నెలలో టెండర్లు ఆహ్వానిస్తే 6 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు టెండర్లు దాఖలు అయ్యాయి.



జూన్ 15 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువుంది. అంతకు ముందు 2014 నవంబర్‌లో 515 మెగావాట్ల సౌర విద్యుత్‌కు టెండర్లు పిలిచి ఆ మేరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) సైతం ప్రభుత్వం కుదుర్చుకుంది. కాగా, గతంలో కుదుర్చుకున్న పీపీఏల ప్రకారం 232 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు జరగాల్సి ఉంది. అంతా కలిపి వచ్చే ఏడాది జూన్ నాటికి 2,747 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

అక్కడికక్కడే ఉత్పత్తి, సరఫరా..

ప్లాంట్లను ఓ చోట పెట్టి రాష్ట్రమంతా సరఫరా చేయడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్పత్తి కేంద్రం నుంచి కొత్త లైన్లనూ వేయాల్సి వుంటుంది. దీనికి పరిష్కారంగా సబ్‌స్టేషన్లకు 5 కి.మీ.ల పరిధిలో కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సబ్‌స్టేషన్ల సామర్థ్యం, ప్రస్తుత విద్యుత్ సరఫరా మధ్య లోటును అక్కడికక్కడ ఉత్పత్తి చేసే సౌర విద్యుత్ ద్వారా పూడ్చనున్నారు. ఒక వేళ సబ్‌స్టేషన్‌కు పూర్తి సామర్థ్యం మేర సరఫరా ఉన్నా..సౌర విద్యుత్ పోను మిగతా విద్యుత్‌ను సరఫరా చేస్తారు.



ఉదాహరణకు సబ్‌స్టేషన్ సామర్థ్యం 50 మెగావాట్లు ఉంటే, అక్కడ 10 మెగావాట్ల సౌర ఉత్పత్తి ఉంటే, ఇతర మార్గాల ద్వారా మిగిలిన 40 మెగావాట్లనే ఆ సబ్‌స్టేషన్‌కు పంపుతారు. త్వరలో మహబూబ్‌నగర్‌లో 400, మెదక్‌లో 500, నల్లగొండలో 600, రంగారెడ్డిలో 100, వరంగల్‌లో 300, కరీంనగర్‌లో 300, ఖమ్మంలో 200, నిజామాబాద్‌లో 400, ఆదిలాబాద్‌లో 200 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాలు నెలకొల్పనున్నారు.

 

‘పవర్’ ధరలు పడిపోతున్నాయి...

సౌర విద్యుత్ కొనుగోళ్లకు ప్రభుత్వం అనుసరించిన విధానంతో ధరలు దిగి వస్తున్నాయి. తొలి విడత టెండర్ల ద్వారా సగటున యూనిట్‌కు రూ.6.72 ధరతో 515 మెగావాట్లను 25 ఏళ్ల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పీపీఏలు కుదుర్చుకుంది. అంతకు తక్కువ ధరకు 2 వేల మెగావాట్లను కొనుగోలు చేసేందుకు రివర్స్ బిడ్డింగ్ టెండర్ నిర్వహించగా ఏకంగా 6 వేల మెగావాట్లకు స్పందన వచ్చింది. అందరి కంటే తక్కువ ధర సూచించిన వారిని ఎంపిక చేయనుండడంతో ధరలు సైతం దిగి వస్తున్నాయి.

 

సౌర విధానానికి పురస్కారం

రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటించిన  సౌర విద్యుత్ విధానం అందరినీ ఆకర్షిస్తోం ది. సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే ‘మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ తెలంగాణ సౌర విధానానికి ప్రత్యేక అవార్డు ప్రకటించింది. ఆల్ ఇండియా విండ్ సోలార్ పవర్ అసోసియేషన్ సైతం ఇటీవల గౌహతిలో జరిగిన సమావేశంలో ప్రశంసించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top